Update (16 November 2023):
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ బీఆర్ఎస్ పార్టీకు మద్దతు తెలిపిందంటూ మరొక లెటర్ కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతంది. తెలంగాణ బీఆర్ఎస్ పాలన బాగుందని మరియు చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ చంద్రబాబుకు మద్దతు తెలిపిందని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకు మద్దతు తెలపాలని చంద్రబాబు కోరినట్టు టీడీపీ లెటర్ హెడ్‌ను షేర్ చేస్తున్నారు.

ఐతే బీఆర్ఎస్ పార్టీకు టీడీపీ మద్దతు తెలిపిందన్న వార్తలో నిజం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేర్ అవుతున్న లెటర్ ఫేక్. ఒకవేళ టీడీపీ నిజంగా బీఆర్ఎస్ పార్టీకు మద్దతు తెలిపి ఉంటే, మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి రిపోర్ట్స్ ఏవి మాకు కనిపించలేదు. టీడీపీ సోషల్ మీడియా అకౌంట్‌లలో/పార్టీ వెబ్‌సైట్‌లో గానీ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి లెటర్ లేదు.
కాబట్టి ఈ లెటర్ హెడ్‌ను డిజిటల్‌గా రూపొందించి, షేర్ చేసి ఉండవచ్చు. కాగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోవడం లేదని ఇప్పటికే ప్రకటించింది.
Published (10 November 2023):
ఇప్పుడు జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు రాసాడంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ లేఖకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖ.
ఫాక్ట్(నిజం): తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని చంద్రబాబు పేరిట వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ సైబర్ పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 30వ తారీకున అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఐతే ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు కోరినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే నిజానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని కోరుతూ ఎలాంటి లేఖ రాయలేదు.
ఈ లేఖకు సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ లేఖ ఫేక్ అని దృవీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేసిన ఒక ట్వీట్ కనిపించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ లేఖ ఫేక్ అని స్పష్టం చేసారు.
ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ సైబర్ పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత పేరుతో లెటర్ హెడ్‌తో నకిలీ లేఖను విడుదల చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని చంద్రబాబు పేరిట వైరల్ అవుతున్న లెటర్ ఫేక్.