Fake News, Telugu
 

ఆవు మీద తెలుపు చారలు గీయడం వల్ల వాటిని కీటకాలు కుట్టకుండా ఉంటాయా అనే పరిశోధనకు, బయాలజీలో ఇగ్ (Ig®) నోబెల్ ప్రైజ్ వచ్చింది, 2025 నోబెల్ ప్రైజ్ కాదు

0

గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇలా చేయడం వల్ల గేదెలు సాధారణంగా ఇచ్చే పాల కంటే ఎక్కువ పాలు ఇవ్వడం మొదలు పెట్టాయని, ఈ పరిశోధన చేసినందుకు గాను, ఆ శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని ఈ వీడియోలో చెప్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇస్తాయనే విషయాన్ని పరిశోధించి కనుక్కొన్నందుకు, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చింది.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు వచ్చింది 2025 బయాలజీ Ig® నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్), నిజమైన నోబెల్ ప్రైజ్ కాదు. అసలు నోబెల్ ప్రైజ్ వారు, అనగా నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్(organization) బయాలజీ క్యాటగిరిలో బహుమతులు ఇవ్వరు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, నోబెల్ ప్రైజ్ యొక్క అధికారిక వెబ్సైటులో ఈ ఏడాది, అనగా 2025కు గాను నోబెల్ బహుమతులు అందుకున్న వ్యక్తులు జాబితాను మేము చూసాము. ఇందులో ఎక్కడ కూడా, వైరల్ వీడియోలో పేర్కొన్నట్లు గేదెపై తెల్ల చారలు గీసి, వాటి పాలు ఇచ్చే స్థాయిని పెంచే ప్రక్రియను కనుగొన్నందుకు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వచ్చిందనీ విషయం పేర్కొనబడలేదు.. 

ఆ తర్వతా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలో పేర్కొన్న నోబెల్ ప్రైజ్ నిజానికి ‘Improbable Research’ అనే సంస్థ వారు ప్రతి ఏటా ఇచ్చే Ig® నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్) అని, ఆవిష్కర్త, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇచ్చే నోబెల్ ప్రైజ్ కాదని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

Ig నోబెల్ ప్రైజ్‌ను మార్క్ ఆబ్రహామ్స్ అనే వ్యక్తి 1991లో స్థాపించారు. ప్రజలను ముందుగా నవ్వేలా చేసే, ఆ తర్వాత ఆలోచింపచేసే అచీవ్‌మెంట్‌లకు (ఘనకార్యాలకు) ఆయన ఈ అవార్డులను ప్రతి ఏడాది బహూకరిస్తారు. ఈయన ‘Annals of Improbable Research’ అనే మ్యాగజీన్‌ను కూడా నడుపుతారు. 

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న శాస్త్రవేత్తలు బహుమతి అందుకుంటున్న దృశ్యాలు ఈ ఏడాది Ig నోబెల్ ప్రైజ్ కార్యక్రమానివి. ఆవుల మీద జీబ్రా లాంటి తెల్ల రంగు చారలు గీయడం వల్ల వాటిని కీటకాలు కుట్టకుండా చేయవచ్చా అని వారు చేసిన పరిశోధనకు గానీ, జపాన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది బయాలజీలో Ig నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్) ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ). 

వాస్తవానికి, వైరల్ వీడియోలో ఉన్న ఈ ప్రైజ్‌కు చెందిన దృశ్యాలలో, వాళ్లు అందుకుంటున్న షీల్డ్ మీద Ig నోబెల్ ప్రైజ్ అని ఉండటం చూడవచ్చు. దీనికి చెందిన దృశ్యాలను చూపిస్తూ, వీళ్లకు నిజమైన నోబెల్ బహుమతి (బయాలజీలో) వచ్చిందని వైరల్ వీడియోలో తప్పుగా చెప్తున్నారు.

వాస్తవానికి. అసలు బయాలజీలో నోబెల్ బహుమతి లేదు, ఫిజియాలజీ లేదా మెడిసిన్, ఫిజిక్స్, ఎకనామిక్ సైన్సెస్, శాంతి(peace), కెమిస్ట్రీ, లిటరేచర్ వంటి విభాగాల్లో మాత్రమే నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్(organization) వారు ప్రకటిస్తూ ఉంటారు

Ignoble అనేది నిజమైన నోబెల్ ప్రైజ్ పేరుకు ఒక రెండర్థాల పదం లాగా అంటే ఆంగ్లంలో pun, లాగా Ig నోబెల్ ప్రైజ్ (ఇగ్-నోబెల్) ఉంటుంది. 

చివరగా, ఆవు మీద తెలుపు చారలు గీయడం వల్ల వాటిని కీటకాలు కుట్టకుండా ఉంటాయా అనే పరిశోధనకు జపాన్ దేశ శాస్త్రవేత్తలకు బయాలజీలో ఇగ్ (Ig®) నోబెల్ ప్రైజ్ వచ్చింది, 2025 నోబెల్ ప్రైజ్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll