రోడ్డుపై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద ఒక మహిళ బట్టలు ఉతుకుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ ఘటన తెలంగాణలో జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత పరిస్థితి ఇలా అయ్యిందని అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలో మహిళ రోడ్డుపై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుకుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతికిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రిపోర్ట్ అయింది. ఐతే మహిళ ఇలా చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
రోడ్డుపై వాటర్ ఫౌంటెన్ వద్ద మహిళ బట్టలు ఉతికిన ఈ ఘటన ఇటీవల రిపోర్ట్ అయ్యింది. ఐతే ఈ ఘటనతో తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ వీడియోను ఇటీవల రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఫౌంటెన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేయగా, ఒక మహిళ ఇలా ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఐతే ఆ మహిళ ఇలా చేయడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
ఈ వార్తా కథనాల ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో నిడదవోలులోని గణపతి సెంటర్ గురించి వెతకగా స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం యొక్క పాత ఫోటోలు మాకు కనిపించాయి. ఈ ఫోటోలను ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్స్‌తో పోల్చి చూస్తే కొన్ని సారూప్యతలు గమనించొచ్చు. రెండింటిలో ఒకే బిల్డింగ్స్ మరియు కమర్షియల్ షాప్స్ గమనించవచ్చు. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో నిజంగానే నిడదవోలుకు సంబంధించిందని స్పష్టమవుతుంది.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రిపోర్ట్ అయినట్టు తెలిపే మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల ప్రకారం ఈ వీడియోలోని ఘటనకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, రోడ్డుపై వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతికిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ అయ్యింది, తెలంగాణలో కాదు.