నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్నాయని చెప్తూ, రాత్రి వేల సింహాలు సంచరిస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా ఇదే వీడియోని ఇదే క్లెయిమ్ తో అప్లోడ్ చేసారు, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని చొక్లి గ్రామ వీధుల్లో సింహాలు సంచరించిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటనకి సంబంధించి వార్తా కథనం అందుబాటులో ఉంది. పైగా నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోలోని విజువల్స్ ని పోలిన ఫోటోని ప్రచురించిన ఒక గుజరాతీ వార్తా కథనం మాకు కనిపించింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ ప్రాంతంలోని గ్రామాల్లో గిర్ నేషనల్ పార్క్ నుండి వచ్చిన కొన్ని సింహాలు సంచరిస్తున్నయని తెలుపుతున్న ఈ కథనంలో పోస్టులోని వీడియో స్క్రీన్ షాట్ ని పోలిన ఒక ఫోటో ప్రచురించారు.
ఈ కథనంలో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులోని వీడియోని పోలిన విజువల్స్ ప్రచురించిన TV9 Gujarati న్యూస్ వీడియో మాకు కనిపించింది. 20 డిసెంబర్ 2020 రోజున అప్లోడ్ చేసిన ఈ వీడియో కథనం ప్రకారం గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని చొక్లి గ్రామంలో సింహాలు సంచరించాయి, పోస్టులోని వీడియో ఈ ఘటనకి సంబంధించిందే. ఈ వార్తా కథనం ప్రకారం ఈ వీడియో గుజరాత్‌కి సంబంధించిందని కచ్చితంగా చెప్పొచ్చు.
గుజరాత్‌లోని కోవాయ అనే మరొక గ్రామంలో సింహాల సంచరణకి సంబంధించిన న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఐతే ఇటీవల కాలంలో నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. వీటన్నిటి బట్టి పోస్టులోని వీడియో నిజామాబాద్‌కి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, వీధుల్లో సింహాలు సంచరిస్తున్న ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది, నిజామాబాద్‌లో కాదు.