ఒక బైక్ రైడర్ తన బైక్ మీద ఉన్న స్టిక్కర్ విషయంలో ఒక ట్రాఫిక్ పోలీసుతో వాదిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగిందని, ఆ ట్రాఫిక్ పోలిస్ ఆఫీసర్ ముస్లిం అని పోస్టు యొక్క వివరణలో పేర్కొన్నారు. అసలు ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్లో ఒక బైకర్ని తన బండి పైన ఉన్న భగవంతుని స్టిక్కర్ తీసివేయమని ఒక ముస్లిం ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది, పశ్చిమ బెంగాల్లో కాదు. ఈ వీడియోలో కనబడుతున్న పోలిస్ ఆఫీసర్ పేరు దినేష్ సింగ్, క్లెయిమ్ చేస్తున్నట్టుగా ముస్లిం కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియో గురించి మరిన్ని వివరాల్ని తెలుసుకోవటానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్లో వెతకగా. ఈ సంఘటన ఉత్తర్ ప్రదెశ్లోని లకీంపూర్లో జరిగింది అని తెలిసింది. ముందుగా ఈ వీడియో మయాంక్ శకున్ అవస్థి అనే వ్యక్తి 26 ఆగస్టు 2023 నాడు తన Facebookలో పోస్టు చేసాడు అని గమనించాము.

‘లకీంపూర్లో ఇవి ఏ విధమైన ఆదేశాలు? బండి పైన ఓం, ఖాటూ శ్యామ్ అని రాసి ఉంటే చలాన్ రాయడం ఏంటి’ అని అంటూ ఒక RTO ఆర్డర్, వైరల్ వీడియోని పోస్టు చేసాడు. లకీంపూర్ ఉత్తర్ ప్రదేశ్‌లో ఉంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాదు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోనే జరిగింది అని ఆజ్ తక్ వారు మయాంక్ తోటి మాట్లాడి నిర్ధారించుకున్నారు.
ఇటీవల(ఆగస్టు 2023లో), కులాన్ని, మతాన్ని లేదా తమ పదవి, తదితర విషయాల్ని సూచించే స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించిన వాహనదారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జరిమానా విధించే కార్యక్రమం చేపట్టింది (ఇక్కడ, ఇక్కడ).

ఇటువంటిది పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగినట్లు ఎటువంటి రిపోర్టులు లేవు. ఈ వీడియోలో ట్రాఫిక్ పోలిస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద ఉన్న చిహ్నం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చిహ్నంతో సరిపోతుంది, పశ్చిమ బెంగాల్ పోలీస్ చిహ్నంతో కాదు.

ఈ వీడియోను Facebookలో పోస్టు చేసిన మయాంక్ శకున్ అవస్థి 3 సెప్టెంబర్ 2023 నాడు ఆ వీడియోలో కనిపిస్తున్న పోలీస్ ఆఫీసర్ దినేష్ సింగ్ తో ఒక ఫోటో దిగి ఒక Facebookలో ఒక పోస్టు చేసారు. దినేష్ సింగ్ తనను కలవటానికి తన ఇంటికి వచ్చారు అని ఇందులో పేర్కొన్నారు.
వైరల్ పోస్టులో చెప్తున్నట్లు ఈయన ముస్లిం కాదు, ఈ విషయం వైరల్ విడియోలోనే అర్ధం అవుతుంది. వీడియోలో 14 సెకెన్ల దెగ్గర, మయాంక్ తన పేరు అడిగినప్పుడు దినేష్ తన యూనిఫామ్ మీద ఉంది అని చెప్తాడు, అప్పుడు మయాంక్ అవస్థి దినేష్ సింగ్ అని చదువుతారు. ఈ ఆధారాలను బట్టి ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది అని, పోస్టులో చెప్పినట్టు పశ్చిమ బెంగాల్లో కాదని అర్ధం అవుతుంది.

చివరిగా, ఒక బైకర్‌కి ఒక ట్రాఫిక్ పొలీస్కి మధ్య జరిగిన వాగ్వాదం యొక్క ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్‌ది, పశ్చిమ బెంగాల్‌ది కాదు.