Fake News, Telugu
 

జేసీబీ సహాయంతో తరలిస్తున్న ఈ భారీ పాము తిరుపతిలో కనిపించిందన్న వార్తలో నిజం లేదు

0

తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనిపించిందంటూ ఒక భారీ పామును క్రేన్ సహాయంతో తరలిస్తున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో కనిపించిన 32 అడుగుల కొండచిలువను క్రేన్ సహాయంతో తరలిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో వినిపిస్తున్న మాటలు బట్టి ఈ ఘటన భారత్‌లో జరగలేదని అర్ధమవుతుంది. ఇదే ఘటన జార్ఖండ్‌లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే, అక్కడి అధికారులు దీన్ని ఖండించారు. ఈ వీడియో మొదట 10 అక్టోబర్ 2021న టిక్‌టాక్‌లో అప్లోడ్ కాగా, అక్కిడి నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ ఘటన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, డొమినికాలో జరిగిందంటూ పలు ఆన్లైన్ కథనాలు రాసినప్పటికీ, ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తిరుపతిలో ఇలాంటి ఒక భారీ పాము కనిపించినట్టు ఎటువంటి అధికారిక సమాచారంగానీ, వార్తా కథనాలుగానీ లేవు. ఒకవేళ నిజంగానే తిరుపతిలో ఇలాంటి భారీ పాము కనిపించి ఉంటే మీడియా రిపోర్ట్ చేసి ఉండేది.

ఇంతకుముందు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ పాము కనిపించిందంటూ ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ధన్‌బాద్‌లోని సంబంధిత అధికారులు ఈ వీడియోకి ధన్‌బాద్‌కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసినట్టు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే ఈ వీడియో గత పది రోజుల నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతుంది. ఈ వీడియో మొదటగా 10 అక్టోబర్ 2021న టిక్‌టాక్‌లో fakrulazwa అనే పేరుతో ఉన్న అకౌంట్‌లో అప్లోడ్ అవగా, అక్కడి నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. ఈ అకౌంట్‌లో క్రేన్ సహాయంతో తరలిస్తున్న పాముకి సంబంధించి వేరే ఆంగిల్‌లో షూట్ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేసారు. ఐతే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియలేదు, కాకపోతే వీడియోలో వినిపిస్తున్న మాటల బట్టి, ఇది భారత్‌లో జరిగిన ఘటన కాదని అర్ధం చేసుకోవచ్చు.

ఐతే ఈ వీడియోలోని ఘటన ఇండోనేషియా (ఇక్కడ మరియు ఇక్కడ), ఫిలిప్పీన్స్ (ఇక్కడ), డొమినికాలో (ఇక్కడ) జరిగిందంటూ పలు ఆన్లైన్ కథనాలు రాసినప్పటికీ, ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం మాత్రం లభించలేదు. కాకపోతే ఈ ఘటన భారత్‌లో జరగలేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, జేసీబీ సహాయంతో తరలిస్తున్న ఈ భారీ పాము తిరుపతిలో కనిపించిందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll