బీజేపీకు ఓటు వేస్తే రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బీజేపీ నేత బండి సంజయ్ అన్నట్టు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ‘రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ’, ‘SC, ST, BC రిజర్వేషన్లు రద్దు చేస్తామని’, ‘అంబేద్కర్ వల్లనే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొని పార్టీ బీజేపీ’ అంటూ పలు వ్యాఖ్యలు బండి సంజయ్ ఈ ఆడియో క్లిప్‌లో అన్నట్టు తెలుస్తుంది. ఈ కథనం ద్వారా ఈ క్లిప్‌కు సంబంధించి చేస్తున్న క్లెయిమ్‌లో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీకు ఓటు వేస్తే రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించిన ఆడియో క్లిప్.
ఫాక్ట్(నిజం): రిజర్వేషన్‌ల అంశంపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్టు రూపొందించారు. కానీ బండి సంజయ్ ఎక్కడ కూడా ఆలా అన్నట్టు రిపోర్ట్స్ లేవు. పైగా తాము రిజర్వేషన్‌ల కొనసాగిస్తామని అయన స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బీజేపీ ఇంటర్నల్ మీటింగ్ ఆడియో లీక్ అంటూ షేర్ చేస్తున్న ఈ క్లిప్‌లోని వ్యాఖ్యలు నిజానికి బండి సంజయ్ బహిరంగంగా మీడియా ముందు కాంగ్రెస్ పార్టీను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా కట్/పేస్ట్ చేసి, రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు రూపొందించారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని అని అన్నారు. ఈ ఐతే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్‌ల విషయంలో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
‘అంబేద్కర్ చెప్పినదానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్ లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ అని (ఇక్కడ)’ ‘అంబేద్కర్ వల్లనే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొలేని పార్టీ కాంగ్రెస్ అని (ఇక్కడ)’, ‘రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తోందని (ఇక్కడ)’, ‘మతపరమైన రిజర్వేషన్‌లు రద్దు చేసి వాటిని SC, ST, BC, అగ్రవర్ణాలలోని పేదలకు ఇస్తామని (ఇక్కడ)’ఆయన వ్యాఖ్యానించారు.
ఐతే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని ఆయన అన్నట్టు రూపొందించారు. కానీ బండి సంజయ్ ఈ ప్రెస్ మీట్‌లో ఎక్కడా కూడా అలా అనలేదు. పైగా తాము రిజర్వేషన్‌లు కొనసాగిస్తామని అయన స్పష్టం చేశారు. రిజర్వేషన్‌లు విషయంలో బండి సంజయ్ వైఖరిని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు .
చివరగా, బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్టు ఉన్న ఈ క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసింది.