Fake News, Telugu
 

ఒక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి కుటుంబంతో రాహుల్ గాంధీ దిగిన ఫోటోని తన రహస్య కుటుంబం అనే తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు

0

రాహుల్ గాంధీ రహస్య కుటుంబం అని అర్థం వచ్చేలా క్లెయిమ్ చేస్తూ తను నలుగురు పిల్లలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో ఈ కథనం ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ తన తన రహస్య కుటుంబంతో దిగిన ఫోటో. 

ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీతో పాటు ఫోటోలో ఉన్నది రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా పిల్లలు. ఆమె కూతురు కామాక్షి నంద్వానా తనను కలవాలనుకుంటుందన్న కోరిక గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ, 2022లో తన భారత్ జోడో యాత్రలో వారిని హెలికాప్టర్‌ రైడ్‌లో  తీసుకెళ్లాడు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే 9 డిసెంబర్ 2022న ఇదే ఫోటోతో ఉన్న ఒక యూట్యూబ్ వీడియో రిపోర్ట్ లభించింది. ఇందులో రాహుల్ గాంధీతో పాటు ఉన్న పిల్లలు రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా పిల్లలు అని పేర్కొన్నారు. కింద ఫోటోలో ప్రియాంక నంద్వానా కుటుంబాన్ని చూడవచ్చు. 

అంతేకాక, ఈ రిపోర్టులో రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు కోసం బుండిలోని నైనాని ఫామ్ నుండి సవాయ్ మాధోపూర్‌కు వెళుతుండగా, ప్రియాంక నంద్వానా కూతురు కామాక్షి నంద్వానా తనను కలవాలనుకుంటుందన్న కోరిక గురించి తెలుసుకున్నాడు. కామాక్షి తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నందున, రాహుల్ గాంధీ ఆమెను కలిసి తనను కలవాలన్న కోరిక నెరవేర్చడమే కాకుండా, నంద్వానా కుటుంబానికి చెంది ఆ నలుగురు పిల్లలని హెలికాప్టర్ రైడ్‌లో తీసుకెళ్లారు.

వైరల్ అవుతున్న ఫోటో గురించి లభించిన సమాచారాన్ని ఇదే ఫోటోతో ఉన్న వేరే కథనంలో కూడా చూడవచ్చు. దీనిని బట్టి, ఫోటోలో ఉన్నది రాహుల్ గాంధీ పిల్లలు కాదు అని, వీరు రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పిల్లలు అని స్పష్టం అవుతుంది. అంతేకాక, వైరల్ ఫొటోలో ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న అమ్మాయి మీడియాతో మాట్లడడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. 

చివరగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి కుటుంబంతో రాహుల్ గాంధీ దిగిన ఫోటోని తన రహస్య కుటుంబం అనే తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll