2024 జూన్ 4వ తేదీన 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఫలితాల అనంతరం బ్యాంకాక్ వెళ్తున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వాదనకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు మరుసటి రోజు, అనగా 05 జూన్ 2024 తేదీన రాహుల్ గాంధీ పేరుపై ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్ బోర్డింగ్ పాస్‌ను షేర్ చేస్తున్నారు (ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 05 జూన్ 2024 తేదీన రాహుల్ గాంధీ పేరుపై ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్ బోర్డింగ్ పాస్.
ఫాక్ట్(నిజం): ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నట్టు ఇప్పటివరకైతే ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న బోర్డింగ్ పాస్ 2019లో అజయ్ అవతానీ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు చేసిన ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ పాస్. దీనిని డిజిటల్‌గా ఎడిట్ చేసి రాహుల్ గాంధీ పేరు చేర్చి అలాగే తేదీ/ఫ్లైట్ వివరాలు మార్చారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నట్టు ఇప్పటివరకైతే ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ పేరుతో షేర్ అవుతున్న బోర్డింగ్ పాస్ డిజిటల్‌గా ఎడిట్ చేసింది. మొదటిగా ఈ బోర్డింగ్ పాస్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిపై రెండు వేర్వేరు ఫ్లైట్ నంబర్లు (UK121 & UK115) గమనించొచ్చు. దీన్నిబట్టి ఇది ఎడిట్ చేసిందని అనుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వివరాలు కలిగిన టికెట్‌ను 09 ఆగస్టు 2019న ‘లైవ్ ఫ్రమ్ ఎ లాంజ్’ అనే వెబ్‌సైట్ ప్రచురించినట్టు తెలిసింది. విస్తారా ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్ కు చేసిన ప్రయాణం యొక్క రివ్యూ ఇస్తూ ఈ టికెట్‌ను షేర్ చేశారు.

ఈ బ్లాగ్ ప్రకారం అజయ్ అవతానీ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు 06 ఆగస్టు 2019న ప్రయాణం చేసిన టికెట్ అని తెలుస్తుంది. ప్రస్తుతం షేర్ అవుతున్న టికెట్‌ను దీనితో పోలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. ఐతే ఈ టికెట్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి దానిపై రాహుల్ గాంధీ పేరు చేర్చినట్టు అలాగే తేదీ/ఫ్లైట్ వివరాలు మార్చినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్తున్నాడంటూ షేర్ చేస్తున్న ఈ బోర్డింగ్ పాస్ డిజిటల్‌గా ఎడిట్ చేసింది.