Fake News, Telugu
 

దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా నటిస్తూ మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని పోలీసులు ఎటువంటి హెచ్చరికను జారీ చేయలేదు

0

“సేల్స్ బాయ్స్ లేదా గర్ల్స్ రూపంలో ఎవరైనా వచ్చి పెర్ఫ్యూమ్/అత్తర్ల (Perfume) వాసన చూపిస్తే చూడకండి. అది మీరు పడిపోకుండానే మీ బుర్ర పనిచేయకుండా చేసే డ్రగ్, మీరు ఒక బొమ్మలాగా స్తబ్దుగా నిలబడి చూస్తూనే ఉంటారు, మీ జేబులో చెయ్యి పెట్టీ మీ డబ్బు, నగలు, చేతిలో ఫోన్ మొత్తం కాజేస్తారు, కానీ మీరు వారిని గుర్తు పట్టలేరు, ఎదిరించలేరు, కనీసం అరవలేరు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ హెచ్చరిక సందేశాన్ని పోలీసు శాఖ జారీ చేసిందని ఈ పోస్టులు పేర్కొంటున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా వచ్చి మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిక సందేశం జారీ చేసింది.

ఫాక్ట్(నిజం): దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా నటిస్తూ మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని పోలీసు శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఇదే విషయమై Factly హైదరాబాద్ నగర పోలీసులను సంప్రదించగా, తెలంగాణ పోలీసులు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని, ఈ పోస్టులు ఫేక్ అని వారు స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి పోస్టులు వైరల్ కాగా, అప్పుడు కూడా హైదరాబాద్ పోలీసులు ఆ పోస్టులు ఫేక్ అని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పోలీసు శాఖ ఇలాంటి ఏదైనా హెచ్చరిక సందేశాన్ని జారీ చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన తెలుగు కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ పోస్టులను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ  రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇలాంటి చేసి ఏదైనా హెచ్చరికను జారీ ఉంటే, కచ్చితంగా పలు తెలుగు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.

ఈ క్రమంలోనే, జూలై 2019లో ‘ది న్యూస్ మినిట్’ ప్రచురించిన ఒక వార్తా కథనం దొరికింది. ఈ కథనం ప్రకారం, 2019లో కూడా “హైదరాబాద్‌లోనే 78 మందికి పైగా బాలికలు తప్పిపోయారని, గత 10 రోజులుగా 540 మందికి పైగా మహిళలు తప్పిపోయారని, పెర్ఫ్యూమ్ అమ్మేవారిలా వచ్చి మత్తుమందు వాసన చూపించి బాలికలను ఎత్తుకెళ్తున్నారు” అని ఒక హెచ్చరిక సందేశం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోందని, అయితే ఇందులో నిజం లేదని ఈ కథనం పేర్కొంది.

అంతేకాకుండా, పోలీసు శాఖ పేరుతో ఇలాంటి పలు హెచ్చరిక సందేశాలు చాలా ఏళ్ల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ).

2018 లో కూడా ఇలాంటి హెచ్చరిక సందేశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, హైదరాబాద్ నగర పోలీసులు ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ, ఈ వైరల్ మెసేజ్ ఫేక్ అని పేర్కొన్నారు. 2019 లో కూడా, ఒక పోలీసు అధికారి పేరుతో ఇలాంటి ఒక హెచ్చరిక సందేశం వైరల్ కాగా, అది ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, ఇటీవల హైదరాబాద్ నగర పోలీసులు/ తెలంగాణ పోలీసులు ఇలాంటి ఏదైనా హెచ్చరిక సందేశాన్ని జారీ చేశారా అని తెలుసుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు శాఖను సంప్రదించగా, తెలంగాణ పోలీసులు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని ఈ పోస్టులు ఫేక్ అని స్పష్టం చేశారు. ఇదే విషయమై మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులను కూడా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా నటిస్తూ మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని పోలీసు శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll