ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యపై అమెరికా అవలంబిస్తున్న తీరుపై సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తపరిచిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ రెండు రోజులు ఉన్నప్పటికీ అతన్ని కలవడానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిరాకరించాడాని, దానితో చేసేదేమీలేక ఆంటోనీ బ్లింకన్ అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లాడాని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజులు వేచి ఉంచేలా చేసి చివరికి కలవకుండానే అతన్ని తిరిగి పంపించాడు.
ఫాక్ట్ (నిజం): ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యపై చర్చించడానికి 14 అక్టోబర్ 2023 నాడు సౌదీ అరేబియాకు వెళ్ళిన అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్‌ను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గంటల తరబడి వేచి ఉంచేలా చేసి చివరికి మరుసటి రోజు కలిచారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. 15 అక్టోబర్ 2023 నాడు ఆంటోనీ బ్లింకన్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వం, సౌదీ విదేశాంగ శాఖ అధికారికంగా తమ వెబ్సైటులో పబ్లిష్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యపై చర్చించడానికి 14 అక్టోబర్ 2023 నాడు సౌదీ అరేబియాకు వెళ్ళిన అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్‌ను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గంటల తరబడి వేచి ఉంచేలా చేసి చివరికి సమావేశాన్ని మరుసటి రోజుకి వాయిదా వేశారని వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు తెలిసింది.

మారుసటి రోజు, అంటే 15 అక్టోబర్ 2023 నాడు, ఆంటోనీ బ్లింకన్ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది. 15 అక్టోబర్ 2023 నాడు ఆంటోనీ బ్లింకన్ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వం తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది.

దీని గురుంచి సౌదీ విదేశాంగ శాఖ ట్విట్టర్ ఖాతా నుండి కూడా అధికారిక ట్వీట్ చేసారు.
పాలస్తీనాపై చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ తక్షణమే నిలిపివేయాలని, గాజా స్ట్రిప్‌కు ఆహారం, ఇంధనం, ఇతర సామాగ్రిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఈ సమావేశంలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఆంటోనీ బ్లింకెన్‌తో చెప్పినట్లు అనేక వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పై వివారాల ఆధారంగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై చర్చించడానికి ఇటీవల సౌదీ వెళ్ళిన అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్‌తో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సమావేశమయ్యారని స్పష్టమయ్యింది.
చివరిగా, అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ రెండు రోజులు వేచి చేసి చివరికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలవకుండానే తిరిగి వెళ్ళాడంటూ ఈ పోస్టులో తెలుపుతున్న సమాచారం తప్పు.