Fake News, Telugu
 

పాకిస్తాన్ గెలుపుని ఆస్వాదిస్తూ జై షా, అక్షయ్ కుమార్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు

0

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ గెలుపు సాధించడాన్ని ఆనందిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. 24 అక్టోబర్ 2021 నాడు ‘ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్’లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన పోరులో భారత్ పరాజయం పాలైన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ గెలుపుని ఆస్వాదిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 24 అక్టోబర్ 2021 నాడు భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీసిన దృశ్యాలని చూపిస్తుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్ చివరి బంతికి, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓవర్‌త్రో కారణంగా భారత్‌కు అదనపు పరుగులు వచ్చాయి.  ఈ ఎక్స్‌ట్రా బౌండరీని ఆనందిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ గెలుపుని ఆస్వాదిస్తూ జై షా, అక్షయ్ కుమార్ ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేస్తూ, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఇచ్చిన ఓవర్‌త్రో బౌండరీను ఆనందిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలని తెలిపారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘India.com’ న్యూస్ సంస్థ 24 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.

‘Disney Hotstar’ వెబ్సైటులో 24 అక్టోబర్ 2021 నాడు జరిగిన భారత్-పాక్ మ్యాచ్ యొక్క హైలైట్స్ వీడియోని పబ్లిష్ చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు, ఈ హైలైట్స్ వీడియోలో 6:30 నిమిషాల దగ్గర చూడవచ్చు. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్ చివరి బంతికి పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓవర్‌త్రో కారణంగా భారత్‌కు అదనపు పరుగులు వచ్చాయి. ఈ ఎక్స్‌ట్రా బౌండరీని ఆనందిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ గెలుపుని ఆస్వాదిస్తూ జై షా, అక్షయ్ కుమార్ ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో జై షా మరియు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకుంటుంది పాకిస్తాన్ గెలుపుని  ఆస్వాదిస్తూ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాకిస్తాన్ గెలుపుని ఆస్వాదిస్తూ జై షా, అక్షయ్ కుమార్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll