ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఉచిత బంగారం, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు డబ్బు (ఆర్థిక సాయం), ఆధార్, రేషన్ కార్డుదారులకు పలు ఉచిత పథకాలను ప్రకటించారని పేర్కొంటూ అనేక పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలలో, ప్రధాని మోదీ పలు ఉచిత ప్రయోజనాలను అందిస్తానని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశ ప్రజలకు ఉచిత బంగారం, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు వంటి వివిధ ఉచిత పథకాలను ప్రధాని మోదీ ప్రకటించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులలో పేర్కొన్న ఏ ఉచిత పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఫేక్, ఇవి AI ద్వారా రూపొందించబడ్డాయి. అసలు వీడియోలకు AI జనరేటెడ్ ఆడియో జోడించి ఈ వైరల్ వీడియోలను రూపొందించబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలను జాగ్రత్తగా విశ్లేషించగా, ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు లిప్-సింక్‌లో అసమానతలు గమనించాము. తదుపరి, ఈ వైరల్ వీడియోలోని ఆడియోను AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hiya అనే AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్ ఉపయోగించి ఈ వీడియోలను పరిశీలించగా, ఈ వైరల్ వీడియోలలోని ఆడియో AI-జనరేటెడ్ ఆడియో కావచ్చు అని తేలింది.

వైరల్ వీడియోలలో ఉపయోగించిన ప్రధాని మోదీ ప్రసంగాల అసలు క్లిప్‌లను కూడా మేము కనుగొన్నాము, ఈ ప్రసంగాలలో దేనిలోనూ ప్రధాని మోదీ ఉచిత బంగారం, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు డబ్బు అందిచే పథకాలను ప్రకటించలేదు. ప్రధాని మోదీ అసలు ప్రసంగాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
వైరల్ వీడియోలలో చెప్పినట్లుగా, దేశ ప్రజలకు ఉచిత బంగారం, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు వంటి వివిధ ఉచిత పథకాలను ప్రధాని మోదీ ప్రకటించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ అలాంటి పథకాలను ప్రవేశ్ పెట్టినట్లు కానీ ప్రవేశ పెడుతున్నట్లు కానీ ప్రకటన చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తా కథనాలు మాకు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా భారత ప్రభుత్వ వర్గాలు ఇలాంటి పలు పథకాలను ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి.
తదుపరి, మేము భారత ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అందించే MyScheme వెబ్‌సైట్‌ను,భారత ప్రభుత్వం యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) జారీ చేసిన పత్రికా ప్రకటనలను కూడా సమీక్షించాము. అయితే, అక్కడ ఇలాంటి పథకాలను ప్రధాని మోదీ ప్రకటించినట్లు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. అలాగే, ప్రధాని మోదీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఆయన పోస్టులలో పేర్కొన్న ‘ఉచిత పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఎటువంటి పోస్టులు చేయలేదు.
పౌరుల ప్రయోజనం కోసం ప్రధాని మోదీ అనేక ఉచిత పథకాలను ప్రకటించారా? గతంలో ప్రధాని మోదీ ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు, రేషన్ కార్డుదారులకు డబ్బు అందించే పథకాలను ప్రకటించారని పోస్ట్‌లు వైరల్ అయినప్పుడు, ఫ్యాక్ట్లీ వాటిని ఫ్యాక్ట్-చెక్ చేసి, అవి నకిలీవని నిర్ధారించింది.
ఈ వైరల్ క్లెయిమ్‌ను షేర్ చేసిన పలు సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించినప్పుడు, ఈ ఖాతాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) తరచుగా ప్రధాని మోదీ వీడియోలను/ఫోటోలను ఉపయోగిస్తూ, ఉచిత బంగారం, ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు, ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్‌లు, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు డబ్బు అందిచేందుకు పథకాలను మోదీ/కేంద్రం ప్రకటించిందని పేర్కొంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజలను వ్యాప్తి చేస్తున్నాయని మేము గుర్తించాము. ఈ పోస్ట్‌లు తరచుగా ఫిషింగ్ లింక్‌లను కలిగి ఉంటాయి. వినియోగదారులు ఈ వీడియోలలో చెప్పిన విధంగా ఈ లింక్‌లలో వారి వివరాలను షేర్ చేస్తే వారికి సంబంధించిన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రేషన్ కార్డ్ వివరాల వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలను దొంగిలించబడి దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
చివరిగా, ప్రధాని మోదీ పలు ఉచిత పథకాలను ప్రకటించారని చెబుతూ AI ద్వారా రూపొందించిన వీడియోలను తప్పుగా షేర్ చేస్తున్నారు.

