ఫేస్బుక్ లో రెండు ఫొటోలను పెట్టి, రెండిట్లో ఉన్నది ఒకే వ్యక్తి అనీ, మొదటి ఫోటో ఆ వ్యక్తి CAA కి వ్యతిరేకంగా రాళ్లు విసురుతున్నప్పటిది మరియు రెండవది అతను ఆ పని చేసినందుకు పోలీసులు కొట్టిన తర్వాతదని వాటి గురించి చెప్తున్నారు. పోస్టులోని ఫోటోల గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫొటోల్లో రాయి వేస్తున్న వ్యక్తి మరియు గాయాలతో ఉన్న వ్యక్తి ఒకరే.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని రెండు ఫొటోల్లో ఉన్నది ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. రెండవ ఫొటోలోని వ్యక్తిని పోలీసులు కొట్టింది రాళ్లు రువ్వినందుకు కాదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని మొదటి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Hindustan Times’ వారి ‘లక్నో’ ఎడిషన్ లో లభించింది. ఆ కథనం ద్వారా, ఆ ఫోటోని డిసెంబర్ 21, 2019 న కాన్పూర్ లో తీసినట్లుగా తెలుస్తుంది. కానీ, ఆ ఫొటోలోని వ్యక్తి గురించి అందులో ఎటువంటి సమాచారం లేదు.
పోస్టులోని రెండవ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Caravan Daily’ వార్తా పత్రిక యొక్క కథనం లో లభించింది. ఆ కథానం ద్వారా, ఆ ఫొటోలోని వ్యక్తి ‘మౌలానా అసద్ రజా హుస్సేని’ అని తెలుస్తుంది. దాని ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు డిసెంబర్ 20, 2019 న ముజాఫర్నగర్ లోని ‘సాదత్ మదర్సా’ లోకి ప్రవేశించి, ఆ మదర్సా విద్యార్థులను మరియు వారి గురువు ‘మౌలానా అసద్ రజా హుస్సేని’ కొట్టారని భాదితులు ఆరోపించినట్టు తెలుస్తుంది.
‘Times of India’ కథనం ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు డిసెంబర్ 20, 2019న ‘సాదత్ మదర్సా’ లోకి ప్రవేశించి ‘హుస్సేని’ ని బలవంతంగా బైటికి తీసుకొచ్చి, ఒక నిర్మానుష్యం అయిన ప్రాంతంలో అతని పై కొన్ని గంటల పాటు దాడి చేసి డిసెంబర్ 21, 2019న వదిలేశారు.
చివరగా, పోస్టులోని రెండు ఫొటోల్లో ఉన్నది ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. మొదటి ఫోటో డిసెంబర్ 21, 2019 న కాన్పూర్ లో రాళ్లు రువ్వుతున్న అతనిది అయితే, రెండవ ఫొటో ముజాఫర్నగర్ లోని ‘సాదత్ మదర్సా’ గురువు ‘మౌలానా అసద్ రజా హుస్సేని’ ని డిసెంబర్ 20, 2019 రాత్రి పోలీసుల చర్య తరువాత తీసింది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?