పగ్గాలు చేపట్టిన సమయంలో (2017) 2.5 లక్షల కోట్లున్న రాష్ట్ర ఆదాయాన్ని కొత్త పన్నులేకుండా 4 ఏళ్లలో 5 లక్షల కోట్లకు చేర్చిన యోగీ అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూదాం.
క్లెయిమ్: యోగీ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని 2.5 నుండి 5 లక్షల కోట్లకు పెంచింది.
ఫాక్ట్: రాష్ట్ర మొత్తం ఆదాయం అంటే రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నులలో వాటా, కేంద్రం నుండి గ్రాంట్లకు సమానం. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంభందించి రాష్ట్ర మొత్తం ఆదాయం 2017-2018 లో 2,78,775 కోట్లు, 2021-2022 (Budget Estimate) లో 4,18,340 కోట్లు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఆదాయం గురించి వెతికినప్పుడు RBI వారి వెబ్ సైట్ లో సమాచారం లభించింది. RBI ప్రతి సంవత్సరం ‘Handbook of Statistics on Indian States’ అనే రిపోర్ట్ ను రిలీజ్ చేస్తుంది, ఇది రాష్ట్రాలకు సంభందించి స్టాటిస్టిక్స్ ను పబ్లిష్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ద్వారా ‘రాష్ట్ర సొంత పన్ను ఆదాయం’ మరియు ‘రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం’ తెలుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి సంభందించి రాష్ట్ర ఆదాయం కూడా ఈ రిపోర్ట్ నుండి తెలిసింది. 2017 లో యోగీ ప్రభుత్వం ఎర్పడప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ‘రాష్ట్ర సొంత పన్ను ఆదాయం’ 1,09,605 కోట్లు మరియు ‘రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం’ 19,795 కోట్లు. 2019-2020 (BE) లో ‘రాష్ట్ర సొంత పన్ను ఆదాయం’ 1,44,249 కోట్లు మరియు ‘రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం’ 30,633 కోట్లు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క పూర్తి రెవెన్యూ అంటే రాష్ట్ర మొత్తం ఆదాయం కోసం వెతికినప్పుడు RBI వెబ్ సైట్ లో లభించింది. RBI ప్రతి సంవత్సరం ‘State Finances: A Study of Budgets’ అనే రిపోర్ట్ ను రిలీజ్ చేస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవహారాల సమాచారం మరియు విశ్లేషణ అందిస్తుంది. RBI లేటెస్ట్ గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంభందించి రాష్ట్ర మొత్తం ఆదాయం 2017-2018 లో 2,78,775 కోట్లు, 2021-2022 (BE) లో 4,18,340 కోట్లు.
రాష్ట్ర మొత్తం ఆదాయం అంటే రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, రాష్ట్ర సొంత పన్ను యేతర ఆదాయం, కేంద్ర పన్నులలో వాటా, కేంద్రం నుండి గ్రాంట్లకు సమానం. 2017-2021 వ్యవధిలో సుమారు 1.5 రెట్లు రాష్ట్ర మొత్తం ఆదాయం పెరిగింది. అంతకముందు 5 సంవత్సరాల వ్యవధిలో (2012-17) సుమారు 1.9 రెట్లు పెరిగింది. దానికంటే ముందు 5 సంవత్సరాల (2007-12) సమయంలో సుమారు 2.1 రెట్లు రాష్ట్ర మొత్తం ఆదాయం పెరిగింది. ఈ సారి కోవిడ్-19 మహమ్మారి మూలాన అన్ని రాష్ట్రాల ఆదాయం ఇంతకముందు సంవత్సరం తొ పోలిస్తే తగ్గింది అని RBI రిపోర్ట్ లో చూడొచ్చు.
చివరగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఆదాయాన్ని తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు.