Fake News, Telugu
 

కొందరు ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ సభ్యులు నిజంగానే భగవద్గీత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసారు.

0

ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ లో భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్న మంత్రులు అని చెప్తూ, కొందరి వ్యక్తుల ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ లో భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్న మంత్రుల ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో నిజంగానే ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ సభ్యులు భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నారు. కాకపోతే, వారు మంత్రులు కాదు; కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే. కావున పోస్ట్ లో చెప్పింది నిజం.

పోస్ట్ లోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోలని కమలా పెర్సాద్ బిస్సేస్సర్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. తాజాగా, ట్రినిడాడ్ & టొబాగో 12 వ పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యులు ఆగస్టు 2020 లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ఫోటోలు తీసినట్టు తెలుస్తుంది. ఆ కార్యక్రమం కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఆ ఫోటోల్లో ఉన్నది  కమలా పెర్సాద్ బిస్సేస్సర్, వందన మొహిత్ మరియు రూడల్ మూనిలాల్. వీరు ముగ్గురు ప్రతిపక్ష పార్టీ అయిన ‘UNC’ (యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ) సభ్యులు.కావున, వారు మంత్రులు కాదు; కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే. అంతేకాదు, ప్రమాణ స్వీకారం అప్పుడు కేవలం భగవద్గీత మాత్రమే కాదు, వేరే సభ్యులు ఇతర మత గ్రంధాలను పట్టుకొని కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ సభ్యులు ఇలా భగవద్గీత మీద ప్రమాణం చేయడం మొదటిసారి కాదు. 2010 లో ప్రధాని గా ఎన్నికైన కమలా పెర్సాద్ బిస్సేస్సర్ భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టు ‘బీబీసీ’ ఆర్టికల్ లో చదవొచ్చు. కమలా పెర్సాద్ బిస్సేస్సర్ భారత సంతతికి చెందిన మహిళ అని ఆ ఆర్టికల్ లో ఉంటుంది.

భారత్ లో ప్రమాణ స్వీకారం:

భారత్ లో దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తారు; లేకపోతే మనసాక్షి లేదా రాజ్యాంగం పై ప్రమాణం చేస్తారు. కానీ, వివిధ మతాలకు సంబంధించిన పుస్తకాలు పట్టుకొని మాత్రం చేయరు. దేవుడిని పిలిచే వివిధ పదాలతో ప్రమాణం చేస్తారు. ప్రధాని మోడీ తన ప్రమాణ స్వీకారం లో ‘ఈశ్వర్’ అని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తే, ఎంఐఎం పార్టీ లీడర్ ఒవైసీ పార్లమెంట్ లో తన ప్రమాణ స్వీకారం లో ‘ఖుదా’ అని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసాడు. ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. సాధ్వి ప్రగ్య సింగ్ ఠాకూర్ తన పేరుకు వేరే పేరు జోడించి చెప్పినందున 2019 లో తనను ప్రమాణ స్వీకారం మధ్యలో ఆపినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, కొందరు ట్రినిడాడ్ & టొబాగో పార్లమెంట్ సభ్యులు నిజంగానే భగవద్గీత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll