రాజస్థాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు అక్కాచెల్లెళ్ళు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. మధ్య తరగతి రైతు సహారన్ యొక్క అయిదుగురు కూతుళ్ళు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఐఏఎస్ అధికారులుగా నియమితులైన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు అక్కాచెల్లెళ్ళ ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న అయిదుగురు అక్కాచెల్లెళ్ళు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) పరీక్షలలో ఉత్తీర్ణులై రాజస్థాన్ రాష్ట్రంలో RAS ఆఫీసర్లుగా నియమితులయ్యారు. 2021 జులై నెలలో విడుదలైన RAS 2018 ఫలితాలలో సహదేవ్ సహరాన్ కుమార్తెలు అన్షు, రీతూ, సుమన్ సహారన్లు ఒకేసారి ఉత్తీర్ణత సాధించి RAS అధికారులుగా నియమితులయ్యారు. సహదేవ్ సహరాన్ ఇద్దరు పెద్ద కుమార్తెలు 2012లోనే RAS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అప్పటికే రాజస్థాన్ ప్రభుత్వంలో RAS అధికారులుగా భాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సహదేవ్ సహరాన్ యొక్క అయిదుగురు కుమార్తెలు RAS అధికారులుగా నియమితులయ్యారు, సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారులుగా నియమితులవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ధైనిక్ భాస్కర్ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. రాజస్థాన్ రాష్ట్రం భేరుసరి గ్రామంలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు 2018లో నిర్వహించిన రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) పరీక్షలో ఒకేసారి ఉత్తీర్ణత సాధించి RAS అధికారులుగా నియమితులైనట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.
2021 జులై నెలలో విడుదలైన RAS 2018 ఫలితాలలో సహదేవ్ సహరాన్ కుమార్తెలు అన్షు, రీతూ, సుమన్ సహారన్లు ఒకేసారి ఉత్తీర్ణత సాధించి RAS అధికారులుగా నియమితులైనట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. సహదేవ్ సహరాన్ ఇద్దరు పెద్ద కుమార్తెలు 2012లో RAS పరీక్షలో ఉత్తీర్ణులై అప్పటికి ఒకరు కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మరొకరు బ్లాక్ డెవలపింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
సహదేవ్ సహరాన్ మరియు అతని అయిదుగురు కూతుర్లని ఇంటర్వ్యూ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఇదివరకు, ఇలాగే RAS పరీక్షలో ఉత్తీర్ణులైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోని షేర్ చేస్తూ వారు UPSC పరీక్షలో ఉత్తీర్ణులైనట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు, Factly దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, ఫోటోలో కనిపిస్తున్న అయిదుగురు అక్కాచెల్లెళ్ళు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) అధికారులుగా నియమితులయ్యారు, యూపిఎస్సిలో ఉత్తీర్ణత సాదించి ఐఏఎస్ అధికారులుగా నియమితులవలేదు.