Fake News, Telugu
 

PEW రీసెర్చ్ సంస్థ వెల్లడించినట్టుగా షేర్ చేస్తున్న ఈ భారత దేశ ముస్లిం మరియు హిందువుల సంతానోత్పత్తి రేటు గణాంకాలు ఫేక్

0

PEW రీసెర్చ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 శాతమనీ, హిందువుల సంతానోత్పత్తి రేటు 0.24 శాతమని పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 శాతమని, హిందువుల సంతానోత్పత్తి రేటు 0.24 శాతమని PEW రీసెర్చ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

ఫాక్ట్ (నిజం): అమెరికాకు చెందిన PEW రీసెర్చ్ సంస్థ 2023 ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన ఒక రిపోర్టులో భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.4 ఉందని, హిందువుల సంతానోత్పత్తి రేటు 1.9 ఉందని పేర్కొంది. 2019-21 సర్వేకి ముందు మూడు సంవత్సరాలలో, దేశంలో ముస్లిం మతస్థుల సంతానోత్పత్తి రేటు అత్యధికంగా 2.36 ఉందని, హిందూ సంతానోత్పత్తి రేటు 1.94 అని, బౌద్ధ మరియు నియో-బౌద్దుల సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా 1.39 ఉందని NFHS 2019-21 సర్వే నివేదికలో తెలిపారు. భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 ఉందని, హిందువుల సంతానోత్పత్తి రేటు కేవలం 0.24 ఉందని PEW రీసెర్చ్ సంస్థ వెల్లడించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, భారత దేశంలోని వివిధ మతస్థుల సంతానోత్పత్తి రేటు వివరాలను తెలుపుతూ PEW రీసెర్చ్ సంస్థ 09 ఫిబ్రవరీ 2023 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. భారత జనాభా చైనా జనాభాను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి (United Nations) అంచనా వేసిన నేపథ్యంలో, భారత దేశ జనాభాకు సంబంధించిన కీలక విషయాలను ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

భారత్ చైనా జనాభాను అధిగమిస్తుందని అంచనా వేయడానికి భారత సంతానోత్పత్తి రేటు కూడా ఒక ముఖ్య కారణమని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. చైనా దేశంలో సంతానోత్పత్తి రేటు 1.2, అమెరికాలో 1.6 ఉంటే, భారత దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 ఉందని, అంటే భారత దేశంలో ఒక మహిళ సగటున ఇద్దరు పిల్లలకి జన్మనివ్వగలుగుతుందని ఈ నివేదికలో తెలిపారు. PEW రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన ఈ నివేదికలో భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.4 ఉందని, హిందువుల సంతానోత్పత్తి రేటు 1.9 ఉందని పేర్కొంది.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS), 2019-21 నివేదిక ఆధారంగా భారత దేశ సంతానోత్పత్తి రేటు వివరాలను ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశామని PEW రీసెర్చ్ సంస్థ తెలిపింది. NFHS పబ్లిష్ చేసిన తాజా నివేదికలో, 2019-21 సర్వేకి ముందు మూడు సంవత్సరాలలో దేశంలో ముస్లిం మతస్థుల సంతానోత్పత్తి రేటు అత్యధికంగా 2.36 ఉందని, హిందూ సంతానోత్పత్తి రేటు 1.94 అని, బౌద్ధ మరియు నియో-బౌద్దుల సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా 1.39 ఉందని తెలిపారు. ఈ విషయాలను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదికలో భారత దేశం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ప్రకటించింది. భారత జనాభా 142.86 కోట్లు కాగా చైనాలో 142.57 కోట్లు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విబాగం (UNFPA) అంచనా వేసింది. భారత సంతానోత్పత్తి రేటు 2.0 అని ఐక్యరాజ్య సమితి కూడా తమ నివేదికలో స్పష్టం చేసింది.

చివరగా, భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 ఉంటే, హిందువుల సంతానోత్పత్తి రేటు కేవలం  0.24 ఉందని PEW రీసెర్చ్ సంస్థ వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll