రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు ఆస్తుల వివరాలు తెలుపుతూ ‘సుమన్ టీవీ ఈస్ట్ గోదావరి’ ఛానల్ పబ్లిష్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. రామోజీరావు ఇంటి విలువ మూడు నుండి నాలుగు కోట్ల వరకు ఉంటుందని ఈ వీడియోలో తెలుపుతున్నారు. కూర్చునే కుర్చీల నుండి టేబుల్స్ వరకు, మంచినీరు తాగే గ్లాసుల నుండి పడుకునే మంచాల వరకు అన్ని బంగారంతో చేసినవే అని ఈ వీడియోలో తెలిపారు. వీటికి సాక్షంగా వేరు వేరు ఫోటోలు కూడా ఈ వీడియోలో చూపెట్టారు. రామోజీరావు మొత్తం ఆస్తి అయిదు లక్షల కోట్లు ఉంటుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రామోజీరావు ఇంటి లోపలి ఫోటోలు చూపిస్తున్న వీడియో
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో షేర్ చేసిన చాలా వరకు ఫోటోలు, రామోజీ ఫిలిం సిటిలోని హోటల్ సితార అలాగే, విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లలోని చిత్రాలని చూపిస్తుంది. రామోజీరావు బంగారు కుర్చీలో కూర్చొని దిగిన ఫోటోని రామోజీరావు ఆఫీసులో తీసారు, ఇంట్లో తీసిన ఫోటో కాదు. ఈ వీడియోని తామే పబ్లిష్ చేసామని, అది తప్పని గుర్తించిన వెంటనే వీడియోని తొలగించినట్టు ‘సుమన్ టీవీ’ ఛానల్ యాజమాన్యం మాకు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోలో షేర్ చేసిన చాలా వరకు ఫోటోలు, రామోజీ ఫిలిం సిటిలోని హోటల్ సితార అలాగే, విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లలోని చిత్రాలని తెలిసింది. ఈ వీడియోలో షేర్ చేసిన హోటల్ సితారలోని చిత్రాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
అలాగే, విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్‌లోని చిత్రాలను కూడా ఈ వీడియోలో షేర్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. డాల్ఫిన్ అలాగే, హోటల్ సితార రెండు రామోజీ గ్రూపుకు సంబంధించినవే అయినప్పటికీ, ఈ చిత్రాలు రామోజీరావు ఇంటిలో తీయలేదని ఈ వివరాల ఆధారంగా స్పష్టమవుతుంది.
రామోజీరావు బంగారం సింహాసనంలో కూర్చున్న ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Forbes’ సంస్థ తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసింది. ఈ ఫోటోని రామోజీరావు ఆఫీసులో తీసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు.
రామోజీరావు ఆస్తులకు సంబంధించి వైరల్ అవుతున్న ఈ వీడియోపై మరింత స్పష్టత కోసం ‘సుమన్ టీవీ’ ఛానల్ యాజమాన్యాన్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాము. ‘సుమన్ టీవీ’ యాజమాన్యం మా ఈ-మెయిల్‌కు సమాధానమిస్తూ, “అవును, ఈ వీడియోని మా ఛానల్ పబ్లిష్ చేసింది, కానీ అది తప్పని గుర్తించిన వెంటనే మేము ఆ వీడియోని తొలగించము”, అని తెలిపారు.
చివరగా, రామోజీ గ్రూపుకు సంబంధించిన హోటల్స్‌లోని చిత్రాలని రామోజీరావు ఇంటిలోని బంగారు వస్తువుల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.