4,500 సంవత్సరాల పూర్వం నాటి శ్రీకృష్ణ – కుచేలుడి చిత్రం ఈజిప్టులోని మ్యూజియంలో ప్రదర్శనలో ఉందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక చిత్రంను విస్తృతంగా షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే ఈ పోస్టులలో భారతదేశానికి సంబంధించిన వేల సంవత్సరాల ప్రాచీన సంపద బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ ప్రదర్శింపబడుతుందని పేర్కొంటున్నారు ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఈజిప్టులోని మ్యూజియంలో ఉన్న 4,500 సంవత్సరాల నాటి శ్రీకృష్ణ – కుచేలుడి చిత్రం.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ చిత్రానికి, ఈజిప్టులోని మ్యూజియంలకు ఎలాంటి సంబంధం లేదు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ ప్రకారం, అక్కడ ఎక్కడా 4,500 సంవత్సరాల నాటి కృష్ణుడు లేదా కుచేలుడి చిత్రాలు ప్రదర్శనలో లేవు.అలాగే, ఈజిప్టులోని ఏ మ్యూజియంలోనూ వాటికి సంబంధించిన ప్రదర్శనలు లేదా రికార్డులు లేవని వారు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 4,500 సంవత్సరాల నాటి శ్రీకృష్ణ – కుచేలుడి చిత్రం ఈజిప్టులోని మ్యూజియంలో ప్రదర్శనలో ఉందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.
ఈ విషయంపై మేము ఈజిప్టులోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజీప్షియన్ సివిలిజేషన్ (NMEC) ను ఇమెయిల్ ద్వారా సంప్రదించాము, మ్యూజియం వారు ఇచ్చిన స్పందన ప్రకారం, వైరల్ పోస్ట్‌లో చెబుతున్నట్టు ఈజిప్టులోని ఏ మ్యూజియంలోను 4,500 సంవత్సరాల నాటి కృష్ణుడు లేదా కుచేలుడి చిత్రాలు ప్రదర్శనలో లేవు. అలాగే, ఈజిప్టులోని ఏ మ్యూజియంలోనూ వాటికి సంబంధించిన ప్రదర్శనలు లేదా రికార్డులు లేవని వారు తెలిపారు.

లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో భారతదేశంలోని వివిధ కాలాలు, ప్రాంతాలకు చెందిన శ్రీకృష్ణుని విగ్రహాలు, చిత్రాలు ఉన్నాయన్నది నిజమే, కానీ ఈ వైరల్ చిత్రం ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉందని చెప్పేందుకు మాకు ఎటువంటి నమ్మదగిన ఆధారాలు లభించలేదు.

మేము ఈ విషయంపై బ్రిటిష్ మ్యూజియం యొక్క ఆసియా విభాగాన్ని కూడా సంప్రదించాము. వారు మా ఈమెయిల్‌కు స్పందిస్తూ, వారి కలెక్షన్‌లో శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేక వస్తువులు ఉన్నాయని, వాటిలో దాదాపు 900 ఆన్‌లైన్‌లో చూడవచ్చని పేర్కొంటూ ఒక లింక్‌ను షేర్ చేశారు. కానీ ఈ వైరల్ చిత్రానికి బ్రిటిష్ మ్యూజియంతో ఎటువంటి సంబంధం లేదని, అది తమ సేకరణలో లేదని వారు స్పష్టం చేశారు.

ఈ చిత్రం యొక్క మూలాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, దీనికి ఈజిప్షియన్ మ్యూజియం లేదా బ్రిటిష్ మ్యూజియంతో ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయగలము.
చివరిగా, ఈజిప్టు మ్యూజియంలో 4,500 సంవత్సరాల నాటి శ్రీకృష్ణుడు-కుచేలుడి చిత్రం ఉందనే వాదనలో నిజం లేదు.