అన్ని పార్లమెంటరీ కమిటీలు నుండి రాహుల్ గాంధీ అవుట్” అని చెప్తున్న ఓ యూట్యూబ్ వీడియోతో కూడిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతూ, “ఇటీవల విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నుండి రాహుల్ గాంధీని విదేశాంగ మంత్రి జైశంకర్ తొలగించారు అని, అలాగే అన్ని పార్లమెంటరీ కమిటీలు నుండి రాహుల్ గాంధీని తొలగించాలని మోదీ నిర్ణయించారని” చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల రాహుల్ గాంధీని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నుండి తొలగించారు, అన్ని పార్లమెంటరీ కమిటీల నుండి రాహుల్ గాంధీని తొలగించాలని మోదీ నిర్ణయించారు.
ఫాక్ట్(నిజం): 2019లో ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రితవ్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీలో రాహుల్ గాంధీ సభ్యుడుగా ఉన్నారు. అయితే, ఇటీవల అక్టోబర్ 2024లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన కొత్త విదేశీ వ్యవహారాల కన్సల్టేటివ్ కమిటీలలో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీలో కూడా రాహుల్ గాంధీ లేరు. అయితే, కన్సల్టేటివ్ కమిటీలు పార్లమెంటరీ కమిటీలు కావు, ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలు. అలాగే, అన్ని పార్లమెంటరీ కమిటీల నుండి రాహుల్ గాంధీని తొలగించారనే వాదనలో నిజం లేదు. ప్రస్తుతం ఆయన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల రాహుల్ గాంధీని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నుండి తొలగించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, విదేశీ వ్యవహారాల మంత్రితవ్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ (సంప్రదింపుల కమిటీ, Consultative Committee) నుండి ఇటీవల రాహుల్ గాంధీని తొలగించారని తెలిసింది (ఇక్కడ).
2019లో ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రితవ్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీలో రాహుల్ గాంధీ సభ్యుడుగా ఉన్నారు (ఇక్కడ). అయితే, ఇటీవల అక్టోబర్ 2024లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన కొత్త కన్సల్టేటివ్ కమిటీలలో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీలో కూడా రాహుల్ గాంధీ లేరు (ఇక్కడ). ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కన్సల్టేటివ్ కమిటీలు పార్లమెంటరీ కమిటీలు కావు, ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలు. కన్సల్టేటివ్ కమిటీ మరియు పార్లమెంటరీ కమిటీ రెండు వేర్వేరు విధులను కలిగి ఉంటాయి.

కన్సల్టేటివ్ కమిటీ (Consultative Committee):
ఈ కమిటీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి లోక్‌సభను రద్దు చేసిన తర్వాత ఈ కమిటీలు రద్దు చేయబడతాయని మరియు లోక్‌సభ కొత్తగా ఏర్పడ్డాక పునర్నిర్మించబడతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కమిటీల కూర్పు, విధులు మరియు విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. వీటిలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉంటారు. ఈ కమిటీల సభ్యత్వం స్వచ్ఛందంగా ఉంటుంది మరియు వివిధ రాజకీయ పార్టీల సభ్యులు మరియు నాయకుల ఎంపికకు వదిలివేయబడుతుంది. ఈ కమిటీలలో గరిష్టంగా 30 మంది మరియు కనిష్టంగా 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు అనుబంధంగా ఉంటాయి. సంబంధిత మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించే మంత్రి /సహాయ మంత్రి ఆ మంత్రిత్వ శాఖ యొక్క కన్సల్టేటివ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు మరియు వాటి అమలు తీరుపై మంత్రులు మరియు పార్లమెంటు సభ్యుల మధ్య అనధికారిక చర్చలకు ఇవి వేదికను అందిస్తాయి (ఇక్కడ).

పార్లమెంటరీ కమిటీ (Parliamentary Committee):
ఇకపోతే, పార్లమెంటరీ కమిటీలు (లోకసభ/ రాజ్యసభ) ద్వారా నియమించబతాయి. అంటే లోకసభ స్పీకర్/ రాజ్యసభ చైర్మన్ ద్వారా ఈ కమిటీలలో సభ్యులు నామినేట్ చేయబడతారు. ఈ కమిటీలు స్పీకర్/చైర్మన్ ఆదేశాల మేరకు పని చేస్తాయి, వాటి నివేదికలను సభకు లేదా స్పీకర్/చైర్మన్‌కు అందజేస్తాయి. చాలా పార్లమెంటరీ కమిటీల పదవీకాలం ఏడాది పాటు ఉంటుంది. పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు, ఆయన సెప్టెంబర్ 2024లో ఈ కమిటీలో నియమించబడ్డారు (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, అన్ని పార్లమెంటరీ కమిటీల నుండి రాహుల్ గాంధీని తొలగించారనే వాదనలో నిజం లేదు; ప్రస్తుతం ఆయన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.