అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి 21 రోజుల వరకు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుందని, వారి మెదడు పని చేయదు అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పసిబిడ్డలకు 21 రోజుల వరకు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుంది, వారి మెదడు పని చేయదు.
ఫాక్ట్(నిజం): అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ మరియు ఇతర రిపోర్ట్స్ ప్రకారం నవజాత శిశువులలో కంటిచూపు పుట్టిన 1 నెల నుండి 12 నెలలు వచ్చేవరికి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం పసిబిడ్డలకి మొదటి నెల రోజులు కేవలం దగ్గరి చూపు మాత్రమే అంటే కేవలం 12 అంగుళాల దూరం వరకే స్పష్టంగా చూడగలరు, అలాగే మొదటి 3 నెలలవరకు వ్యక్తుల మొహాలు లేదా వస్తువులను గుర్తించలేరు. అయితే వారికి మొదటి 3 వారాలు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుంది అని చెప్పడనికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే శిశువు యొక్క మెదడు తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పెరగడం ప్రారంభమవుతుంది మరియు యుక్తవయస్సు వచ్చే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అంతే కాదు, పిల్లలలో మెదడు పనితీరు అనేక అంశాలపై ఆధారపడివుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ వారి రిపోర్ట్ ప్రకారం శిశువులలో వారి కంటిచూపుకు సంబంధించి మొదటి సంవత్సర కాలంలో అనేక మార్పులు వస్తాయి. నవజాత శిశువులు చాలా దగ్గరి చూపు కలిగి ఉంటారు, వారు కేవలం 8-12 అంగుళాల దూరంలో ఉన్న వస్తువులని మాత్రమే చూడగలరు, 12 అంగుళాల కంటే ఎక్కువ దూరంలో ఏదైనా వారికి అస్పష్టంగా కనిపిస్తుంది. నవజాత శిశువులలో కన్నుపాప చిన్నగా ఉండడం మనం గమనిచవచ్చు. ఈ కారణంగా వారి కన్నులు ప్రకాశవంతమైన కాంతిని చూడలేవు మరియు ఎక్కువగా నలుపు, తెలుపు మరియు గ్రే షేడ్స్‌లో మాత్రమే వారికీ కనిపిస్తుంది. కొన్ని వారాలలో వారి కంటి రెటినా అభివృద్ధి చెంది, కనుపాప పెరుగుతుంది. ఇలా ఒక నెల వచ్చేసరికి వారు పెద్ద ఆకారాలు, ప్రకాశవంతమైన రంగులు చూడం, తమ ముందు ఉన్న వస్తువుల పై దృష్టి పెట్టడం మొదలు పెడుతారు, మూడు ఫీట్ల దూరం వరకు వారి కళ్ళు చూడగలవు.
మొదటి 2 నెలలు వారి రెండు కళ్ళు కలిసి పని చేయవు అనగా రెండు కళ్ళు సమాంతరంగా ఒకే వస్తువును చూడవు. శిశువు యొక్క కళ్ళు అడ్డంగా లేదా పక్కలకు తిరుగుతున్నట్లు ఉన్నట్లు కనిపించవచ్చు. ఇది సాదారణం. నెలలు గడిచే కొద్ది కళ్ళు రెండూ ఒకే వస్తువుపై దృష్టి పెట్టడం మొదలు పెడుతాయి, ఒకవేళ ఇలా జరగపోతే కంటి వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది మెల్ల లేదా మెల్లకన్ను (Squint or Strabismus) అనే విధమైన కంటి వ్యాధి అయ్యే ప్రమాదం ఉంది. సుమారు 3 నెలల వయస్సులో, పిల్లల కళ్ళు మధ్య సమన్వయం మెరుగుపడుతుంది, వారు కళ్ళతో కదిలే వస్తువును అనుసరించగలుగుతారు మరియు తల్లిదండ్రుల మొహాలు గుర్తించగలరు. దాదాపు 5 నుండి 8 నెలల వయస్సులో, ఒక వస్తువు వారి నుండి ఎంత దూరంలో ఉందో (డెప్త్ పర్సెప్షన్) చూసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. వారి కళ్ళు ప్రపంచాన్ని పూర్తిగా 3 కోణాలలో (3-D) చూడడం మొదలు అవుతుంది మరియు రంగుల మధ్య తేడాను గుర్తించగలరు. అయితే, పెద్దవారి వలె పూర్తిగా అభివృద్ధి చెందదు. 12 నెలలు వచ్చేసరికి వారి కంటిచూపు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ వారు శిశువులలో కంటిచూపు సమర్థత పెంపునకు చేసిన సూచనలు ఇక్కడ చూడవచ్చు, అలాగే మిచిగాన్ యూనివర్సిటీ సూచలను ఇక్కడ చూడవచ్చు.
అమెరికాకు చెందినా సిడిసి రిపోర్ట్ ప్రకారం శిశువు యొక్క మెదడు తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పెరగడం ప్రారంభమవుతుంది, యుక్తవయస్సు వచ్చే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. పుట్టినప్పుడు, సగటు శిశువు యొక్క మెదడు సగటు వయోజన మెదడు పరిమాణంలో నాలుగింట ఒక వంతు ఉంటుంది, ఇది మొదటి సంవత్సరంలో పరిమాణంలో రెట్టింపు అవుతుంది. మూడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పెద్దవారి పరిమాణంలో 80%-90% వరకు పెరుగుతుంది, 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపు పూర్తిగా పెరుగుతుంది.
ఈ రిపోర్ట్ ప్రకారం పిల్లల మెదడు ఎంత బాగా అభివృద్ధి చెందుతుందనేది జన్యువులతో పాటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లి గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం, గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లకు గురికాకుండ జాగ్రతగా ఉండడం, పిల్లల వారి తల్లిదండ్రులు ఇతర వ్యక్తులు మరియు ప్రపంచం నుండి పొందే అనుభవాలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది.
చివరగా, పసిబిడ్డలకి 21 రోజుల వరకు ప్రతీది తలక్రిందులగా కనిపిస్తుందని మరియు మెదడు పని చేయదు అని చెప్పడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.