Fake News, Telugu
 

ఆవు పేడ మరియు రావి చెట్లలో 5G రేడియేషన్‌ను నిరోధించే శక్తి ఉన్నట్టు చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

5G మొబైల్ నెట్వర్క్ ఉపయోగం వలన మానవాళి మరింత శక్తివంతమైన రేడియేషన్‌కి గురికాబోతుందని, 5జి సిగ్నల్స్ ప్రభావానికి కాకులు మాయమవడం, మనుషులలో క్యాన్సర్లు విపరీతంగా పెరిగే అవకాశముందని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఈ 5జి రేడియేషన్ నుండి గోమాత మరియు రావి చెట్టు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. “UV రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించే శక్తి రావిచెట్టుకు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపితమైంది. అదేవిధంగా, గోవు పేడతో అలికిన ఇళ్ళ పరిసరాల్లో సైతం రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.”, అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: ఆవు పేడ మరియు రావి చెట్టు 5G రేడియేషన్‌ను నిరోధించే శక్తి కలిగి ఉన్నాయి. 

ఫాక్ట్ (నిజం): ఆవు పేడ మరియు రావి చెట్లు 5G రేడియేషన్‌ను తగ్గిస్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆవు పేడ అమర్చిన చిప్ ఉపయోగించడం ద్వారా మొబైల్ రేడియేషన్‌ను పూర్తిగా నిరోధించవచ్చని 2020లో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (RKA) ఛైర్మన్‌ వల్లభాయ్ కతీరియా ఒక మీడియా సమావేశంలో తెలిపారు. కానీ, కతీరియా ఆవు పేడకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా నిరాధారమైనవని బ్రేక్‌త్రు సైన్స్ సొసైటి స్పష్టం చేసింది. 5G లేదా మరే ఇతర వైర్లెస్ టెక్నాలజీల ఉపయోగం ద్వారా ప్రతికూల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు ఇప్పటివరకు నిర్ధారించలేదని WHO మరియు FDA స్పష్టం చేసింది. రేడియేషన్‌ను నిరోధించేందుకు ఎక్కువగా లెడ్ (సీసం)ను వాడుతుంటారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.      

పోస్టులో చేస్తున్న క్లెయిమ్లకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఆవు పేడ అలికిన ఇంటి పరిసరాలలో 5G రేడియేషన్‌ ప్రభావం ఉండదని దృవీకరిస్తూ ఏ ఒక్క పరిశోధన పేపర్ పబ్లిష్ అవలేదని తెలిసింది. ఈ విషయం గురుంచి ఏ ఒక్క వార్తా సంస్థ ప్రచురించలేదు.

ఆవు పేడ అమర్చిన చిప్ ఉపయోగించడం ద్వారా మొబైల్ రేడియేషన్‌ను పూర్తిగా నిరోధించవచ్చని 2020 అక్టోబర్ నెలలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (RKA) మరియు జాతీయ ఆవుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న వల్లభాయ్ కతీరియా ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆవు పేడకు మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను నిరోధించే లక్షణాలు ఉన్నాయని, ఆవు పేడతో తయారుచేసిన చిప్‌ను మొబైల్ ఫోన్లకు అతికించి వాడుకుంటే రాబోయే రోజులలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వల్లభాయ్ కతీరియా ఆ మీడియా సమావేశంలో తెలిపారు. ఆవు పేడ మొబైల్ రేడియేషన్‌ను నిరోధిస్తుందన్నదానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని వల్లభాయ్ కతీరియా అప్పుడు తెలిపారు.    

అయితే, ఆవు పేడ ద్వార రేడియేషన్‌ను నిరోధించవచ్చని తాను చేసిన వ్యాఖ్యలకు శాస్త్రీయ ఆధారాలు, డాటా మరియు ప్రయోగ పరీక్షల వివరాలని అందచేయాలని డిమాండ్ చేస్తూ బ్రేక్‌త్రు సైన్స్ సొసైటి నేతృత్వంలో సుమారు 600 మంది సైంటిస్టులు మరియు పరిశోధకులు వల్లభాయ్ కతీరియాకు లేఖ రాసారు. 2021 జనవరి నెలలో వల్లభాయ్ కతీరియా ఇచ్చిన సమాధానం గురించి బ్రేక్‌త్రు సైన్స్ సొసైటి బదులిస్తూ, “వారి సమాధానం హాస్యోస్పధంగా ఉంది. ఆవు పేడ చిప్‌ను విశ్లేషించామని సౌరాష్ట్ర యూనివర్సిటీ భౌతికశాస్త్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మిహిర్ జోషి, చేసిన వాదనను కూడా శాస్త్రవేత్తలు ప్రశ్నించారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం ఆవు పేడకు సంబంధించి చేసిన విశ్లేషణ మరియు పరీక్ష నివేదిక శాస్త్రీయ ప్రక్రియ యొక్క అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుంది”, అని తెలిపారు. రాజకీయంగా ప్రేరేపించబడిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (RKA) కావాలనే ఆవు పేడ చిప్ల ఉపయోగం ద్వార రేడియేషన్‌ను నిరోధించవచ్చని నకిలీ శాస్త్రాన్ని ప్రోత్సహిస్తోందని బ్రేక్‌త్రు సైన్స్ సొసైటి ప్రజలను హెచ్చరించారు.

2011లో కేఎన్. ఉత్తమ కుమార్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆవు పేడ ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలని గ్రహించి రేడియేషన్‌ను నిరోధిస్తుందని తెలిపారు. కానీ, ఈ విషయాలని తెలుపుతూ ఉత్తమ్ ఎటువంటి అధ్యయనాన్ని పబ్లిష్ చేయలేదు. ఆవు పేడకు రేడియేషన్‌ను నిరోధించే శక్తి ఉండదని పలువురు పరిశోధకులు, ప్రొఫెసర్లు మిడియాకి స్పష్టం చేశారు.  

ఇకపోతే, ఫికస్ రిలిజియోసా అనే శాస్త్రీయ పేరుతో పిలవబడే రావి చెట్టు లేదా పీపాల్ చెట్టు, మనుషులలో మధుమేహం, అతిసారం, మూర్ఛ, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, మరియు లైంగిక రుగ్మతల లాంటి సమస్యలకు సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. రావి చెట్టు ఆకుల నుండి సింతసైజ్ చేయబడిన నానో పార్టికల్స్‌లో యువీ కిరణాలను గ్రహించే శక్తి ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బైయోలాజికల్ ఇన్ఫర్మేషన్ (NCBI) పబ్లిష్ చేసీన ఒక అధ్యయనంలో తెలిపింది. కాని, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు విడుదలయ్యే రేడియేషన్ కేవలం రేడియొ ఫ్రీక్వెన్సీ (RF) ఎనర్జీ మాత్రమే. 

మొబైల్ ఫోన్లు వాడుతున్నప్పుడు అందులో నుండి తక్కువ స్థాయిలో నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల అవుతాయి. అయితే దాని వల్ల మొబైల్ ఫోన్లు వేడెక్కడం తప్పితే, శరీరంపై ఏ ఇతర దుష్ప్రభావాలు పడవని WHOతో సహా మరికొన్ని శాస్త్రీయ అధ్యయనాలు దృవీకరించాయి. వైర్లెస్ టెక్నాలజీల ఉపయోగం ద్వారా ప్రతికూల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో ఎక్కడ దృవీకరించబడలేదని WHO స్పష్టం చేసింది. ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ ఈ నాన్-అయోనైజింగ్ రేడియో తరంగాలు శరీర కణజాలంలోకి చొచ్చుకుపోవడం తక్కువగా ఉంటుందని WHO స్పష్టం చేసింది. రేడియేషన్‌ను నిరోధించేందుకు ఎక్కువగా లెడ్ (సీసం)ను వాడుతుంటారు. వైద్య పరమైన స్కానర్లు, రేడియేషన్ చికిత్సలు, అణు విద్యుత్ రంగంలో, పరిశ్రమల్లో దీన్ని వినియోగిస్తుంటారు.

చివరగా, ఆవు పేడ మరియు రావి చెట్లు 5జి రేడియేషన్‌ను తగ్గిస్తాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.   

Share.

About Author

Comments are closed.

scroll