Fake News, Telugu
 

తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్ళు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్/పక్షవాతం వచ్చే ఆస్కారం ఉందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్ళు పోసుకోవడం వల్ల తల ప్రాంతంలో రక్త ప్రసరణ ఒకేసారి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చే ఆస్కారం ఉందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తలపై నుండి కాకుండా, పాదాల నుండి మొదలు పెట్టి, తలవరకు రావాలని ఈ వీడియోలో చెప్తున్నారు. ఐతే, ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్ళు పోసుకోవడం వల్ల తల ప్రాంతంలో రక్త ప్రసరణ ఒకేసారి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చే ఆస్కారం ఉంది.

ఫాక్ట్(నిజం): సాధారణంగా రక్తపోటు, మధుమేహం, ఒబేసిటీ, అధిక కొలెస్ట్రాల్, అధిక మద్యపానం, ధూమపానం మొదలైనవి బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీసే కారణాలు. కానీ, తలపై నీళ్ళు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్/పక్షవాతం వచ్చే ఆస్కారం ఉందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిపుణులు కూడా ఈ వాదనను ఖండించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మెదడు కణాలకు అవసరమైన ఆక్సిజన్‌ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోయి, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోవడం స్ట్రోక్‌కు, పక్షవాతానికి కారణమవుతోంది. అదే రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం లీక్ అయితే హెమరేజిక్ స్ట్రోక్‌గా వ్యవహరిస్తారు.

అధిక రక్తపోటు, మధుమేహం, ఒబేసిటీ, అధిక కొలెస్ట్రాల్, అధిక మద్యపానం, ధూమపానం మొదలైనవి బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీసే అవకాశం ఉంది. ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు తలపై నీళ్ళు పోసుకోవడం రక్త ప్రసరణ ఒకేసారి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీసే అవకాశం ఉందన్న వాదనకు మాత్రం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించి మరియు దాని కారణమయ్యే ప్రమాద కారకాల గురించి ప్రముఖ ఆరోగ్య సంస్థలు అందించిన వివరాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ సంస్థలేవి కూడా సడన్‌గా తలపై నీళ్ళు పోసుకోవడం బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తాయని మాత్రం తెలపలేదు. ఒకవేళ నిజంగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గాని లేక పక్షవాతానికి ఇది ఒక కారణమై ఉంటే దీని గురించి సమాచారం అందుబాటులో ఉండేది.

గతంలో కూడా ఇదే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయినప్పుడు పలు సంస్థలు నిపుణులను సంప్రదించి ఈ వార్తలో నిజం లేదని నిర్దారించాయి. నిపుణులు కూడా ఈ వాదనను ఖండించారు (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్ళు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్/పక్షవాతం వచ్చే ఆస్కారం ఉందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll