Fake News, Telugu
 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు తెలిపిందన్న వార్త అవాస్తవం

0

ఇటీవల మోదీ అమెరికా పర్యటన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతు ఇస్తామని’ చైనా తెలిపినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతు ఇస్తాం’- చైనా.

ఫాక్ట్ (నిజం): ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు ఇస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై స్పందిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ‘అన్ని దేశాల ప్రయోజనాలు మరియు ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని విస్తృతమైన ప్రజాస్వామ్య సంప్రదింపుల ద్వారా ఒక ప్యాకేజీ రూపంలో పరిష్కారాన్ని వెతికేలా ఐక్యరాజ్య సమితి సంస్కరణలు జరగాలని’ అన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి పెర్మనెంట్ మెంబెర్స్ అయిన ఐదు దేశాలలో ఒకటైన చైనా మద్దతు లేదని తెలిసిందే. ఐతే ఇటీవల కాలంలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు ఇస్తున్నట్టు ఎటువంటి ప్రకటనైతే చేయలేదు. ఒకవేళ ఇలా చేసి ఉంటే మన మీడియా రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి ఎటువంటి మీడియా కథానాలైతే లేవు.

ఐతే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితి వ్యవహారాలకు సంబంధించి చైనా మరియు భారత్ చర్చలు జరిపాయి. ఈ చర్చల నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్, UNSCలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి సంబంధించి మాట్లాడుతూ ‘UNSC యొక్క అధికారం మరియు సామర్థ్యాన్ని పెంచే విధంగా UNSC సంస్కరణలకు చైనా మద్దతు ఇస్తుందని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయాధికారంలో చిన్న మరియు మధ్య తరహా దేశాల పాత్ర ఎక్కువ ఉండే విధంగా భద్రతా మండలి సంస్కరణలకు చైనా మద్దతు ఉంటుందని’ తెలిపాడు.

అలాగే  ‘అన్ని దేశాల ప్రయోజనాలు మరియు ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని విస్తృతమైన ప్రజాస్వామ్య సంప్రదింపుల ద్వారా ఒక ప్యాకేజీ రూపంలో పరిష్కారాన్ని వెతకాలి.’ అని పేర్కొన్నారు.

పైగా గత నెలలో భారతదేశం 5,000 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ కలిగి చైనా, మొత్తం ఆసియా, యూరోప్ మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో లక్ష్యాలను ఛేదించగలగే స్వదేశీ న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని- V మొదటి యూజర్ ట్రయల్‌ను త్వరలో చేపట్టనుందన్న వార్తలు రావడంతో, ఈ విషయంపై చైనా స్పందిస్తూ UNSC తీర్మానాలకు లోబడి భారత్ ఈ ట్రయల్స్ ఆపేయాలని కోరింది.

గతంలో కూడా ఇదే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసారు. 2020లో ఇదే విషయాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ అచుడొచ్చు.

చివరగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు తెలిపిందన్న వార్త అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll