“రేపిస్టులకు అండగా ఉంటాము” అని సీపీఐ-మార్క్సిస్ట్ నేత బృందా కారత్ అన్నారు అని చెప్తున్న పోస్ట్(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మోదీ ప్రభుత్వం తెచ్చిన “డెత్ ఫార్ రిపిస్ట్స్ చట్టం” రేపిస్టుల జీవించే హక్కును కాలరాయడానికే..!” అని తను ఇటీవల అన్నారు అని ఈ పోస్టులో చెప్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రేపిస్టులకు సీపీఐ-మార్క్సిస్ట్ పార్టీ అండగా ఉంటుంది, ‘రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అని బృందా కారత్ అన్నారు.
ఫ్యాక్ట్(నిజం): 2018లో చిన్న పిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయడాన్ని ఆమోదిస్తూ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ పై తన అభిప్రాయాన్ని చెప్తూ, సిద్ధాంత రీత్యా, సీపీఐ-మార్క్సిస్ట్ పార్టీ ఉరిశిక్షకి విరుద్ధం అని బృందా కారత్ చెప్పారు. అంతే కానీ రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
వైరల్ పోస్టులో చెప్తున్నట్లు రేపిస్టులకు అండగా ఉంటాం అని బృందా కారత్ ఇటీవల వ్యాఖ్యలు చేశారా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, ఆమె అలా అన్నట్లుగా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే పోస్టులో చెప్తున్నట్లు “డెత్ ఫర్ రేపిస్ట్స్ చట్టం” అని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అని కూడా ఎటువంటి వార్తా కథనాలు మాకు దొరకలేదు.
అయితే ఈ క్రమంలో, గతంలో బృందా కారత్ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఒక ఆర్డినెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. ఆ కథనాల ప్రకారం, 12 సంవత్సరాల లోపు పిల్లల పై అత్యాచారం చేసిన నేరస్థులకు ఉరిశిక్షను విధించే ఆర్డినెన్స్ ఒకటి 2018లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది (ఇక్కడ మరియు ఇక్కడ)

ఈ విషయం పైన (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) బృందా కారత్ మాట్లాడుతూ, రేపిస్టులను రక్షించడానికి బీజేపీ కొంతమందిని (bands of men) తయారు చేసింది అని అన్నారు (ఇక్కడ, ఇక్కడ).

జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో ఒక ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నేరస్తులను పభుత్వం రక్షిస్తుంది అన్న నిజాన్ని కప్పిపుచ్చడానికి బీజేపీ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని హైదరాబాదులో సీపీఐ-మార్క్సిస్ట్ వారు నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా తాను చెప్పారు.

అలాగే, అరుదైన సందర్భాల్లో నేరస్థులకు ఉరిశిక్ష విధించవచ్చు అని చట్ట పుస్తకాల్లో ఉంది అని చెప్పారు. ఇదే సందర్భంలో తను మాట్లాడుతూ, ఉరిశిక్ష తమ తమ పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధం అని చెప్పారు అంతే కానీ, ‘రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అని బృందా కారత్ అనలేదు.
చివరిగా, ఉరిశిక్ష తమ తమ పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధం అని బృందా కారత్ అన్న వ్యాఖ్యలని వక్రీకరించి, రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, అని బృందా కారత్ అన్నారు అని షేర్ చేస్తున్నారు.