Fake News, Telugu
 

హనుమంతుడు, ఓంకారం ఉన్న ఈ 1818 నాటి నాణాన్ని బ్రిటిష్ వారు ముద్రించారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

0

1818వ సంవత్సరం లో East India కంపెనీ వారు హిందూ మతంపై గౌరవంతో అప్పటి కాయిన్స్ నానెంపై ఒకవైపు హనుమంతుడు, ఒకవైపు ఓంకారం ముద్రిస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన పాలకులు వాటిని తీసేశారు అని అర్థం వచ్చేలా క్లెయిమ్ చేస్తూ, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఉన్న ‘ఒక్క అణా’ నాణెం యొక్క రెండు ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వైరల్ పోస్టులో ఉన్న ఫోటోలు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసిన 1818 సంవత్సరం నాటి హనుమాన్, ఓంకారం ముద్రలు ఉన్న ‘ఒక్క అణా’ నాణెనికి సంబంధించినవి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అప్పటి నాయకులు ఈ నాణం యొక్క చలామణి నిలిపివేశారు.

ఫ్యాక్ట్(నిజం): East India కంపెనీ హనుమాన్, ఓంకారం ముద్రలు ఉన్న నాణేలు ముద్రించినట్లు చెప్పడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. ఈ నాణెం టెంపుల్ టోకెన్‌లు లేదా లెబ్బో నాణేలు వంటి నకిలీ నాణాల కోవలోకి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన నాయకులు ఈ రకమైన నాణేల చలామణిని నిలిపివేసినట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా అసలు ఇలాంటి నాణాన్ని చలామణిలో నుంచి భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం తర్వాత తీసివేసిందా అని వెరిఫై చేయడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. అయితే హనుమాన్, ఓంకారం ఉన్న నాణెం చలామణిని మన ప్రభుత్వం నిలిపివేసినట్లు ధృవీకరించే విశ్వసనీయ, అధికారిక ఆధారాలు ఏవీ మాకు లభించలేదు.

అంతేకాకుండా, భారతదేశంలో లీగల్ టెండర్‌గా పరిగణించబడే నాణేలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న నాణేల జాబితాలో, హనుమంతుడు, ఓంకారం ముద్రలు ఉన్న నాణెం మాత్రం లేదు. అలాగే, RBI వెబ్‌సైట్‌లోని మ్యూజియం విభాగంలో ఉన్న బ్రిటీష్ కాలం నాటి నాణేలలో ఒక్కటి కూడా వైరల్ క్లెయిమ్‌లో ఉన్న ‘ఒక్క అణా’ నాణేన్ని పోలి లేదు.

బ్రిటీష్ కాలం నాటి నాణాల చరిత్ర గురించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 1717లో, బొంబాయి మింట్‌లో నాణేలను ముద్రించడానికి బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ నుండి అనుమతి పొందారు. ఆంగ్ల నమూనా నాణేలు అక్కడ ముద్రించారు. 1717లో నాణేల ముద్రణకు అనుమతి లభించినప్పటికీ, బ్రిటీష్ అధికారులు 1835లో మాత్రమే నాణేల తయారీకి చట్టబద్ధత కల్పించారు. 1835లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నాణేల చట్టం(Coinage Act) ద్వారా దీనికి శ్రీకారం చుట్టారు.

ఇంతేకాక, భారతదేశంలో East India కంపెనీ వారి నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో చలామణిలో ఉన్నటువంటి నాణేల యొక్క చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం, భారత ప్రభుత్వానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంది. ఇందులో ఉన్న ఫొటోల్లో ఒక్క దానిలో కూడా వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా, హిందూ దేవుళ్ల బొమ్మలు కానీ, చిహ్నాలు కానీ లేవు. 

CoinQuest ప్రకారం, వైరల్ ఫొటోలో కనిపిస్తున్న ‘ఒక్క అణా’ నాణెం, ఆ కాలంలో చెల్లుబాటు అయ్యే విలువ ఉండి, ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా జారీ చేయబడినట్లు కనిపిస్తున్నప్పటికీ, అవి నిజమైన నాణేలు కావు. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేయలేదు అని CoinQuest పేర్కొంది. ఇవి టెంపుల్ టోకెన్‌లు లేదా లెబ్బో నాణేలు వంటి వర్గాలకు చెందిన నకిలీ నాణేలు, లీగల్ టెండర్‌ కాదు. వీటికి మతపరమైన లేదా మాంత్రిక ప్రాముఖ్యత ఉంది తప్ప, ఇవి మార్కెట్లో చెల్లుడు అయ్యే నాణేలు కావు.

చివరిగా, ఈ హనుమాన్ నాణెం East India కంపెనీ వారు ప్రవేశ పెట్టినట్టు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులు దీని చలామణి నిలిపివేశారు అని సూచించటానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll