11 నవంబర్ 2025న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అసమర్థత వల్లే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుందని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించినట్లు ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ అనే పత్రికలు వార్తలను ప్రచురించినట్లుగా రెండు పేపర్ క్లిప్పింగ్స్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో కేటీఆర్ గురించి వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్.
ఫాక్ట్: ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో ఎటువంటి వార్తాపత్రికలు, ఈ-పేపర్లు లేవు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్న వెబ్సైట్ల డొమైన్లు రిజిస్టర్ కాలేదు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ క్లిప్పింగ్‌ను పరిశీలించగా ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ లోగోను మార్ఫ్ చేసి ‘మన ఈనాడు’ అని మార్చినట్లుగా గురించాం. అలాగే, ఈ క్లిప్పింగ్‌లో పేర్కొన్న తేదీ 26 అక్టోబర్ 2025 ఆదివారం కాగా శనివారం అని ఉండడం చూడవచ్చు. దీన్ని బట్టి, ఈ వైరల్ క్లిప్పింగ్ ఎడిట్ చేయబడినదని చెప్పవచ్చు.

అలాగే, వైరల్ క్లిప్పింగ్‌లో ఇవ్వబడిన www.manaeenadu.net అనే వెబ్సైట్ మనుగడలో లేదని గుర్తించాం. డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ రిజిస్టర్ కాలేదని, ఇది ప్రస్తుతం అమ్మకానికి ఉందని తెలిసింది.

స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ‘మన ఈనాడు’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. అలాగే, ఈనాడు పత్రిక అధికారిక వెబ్సైట్, ఈ- పేపర్లో కూడా ఈ వార్త ప్రచురించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
అలాగే, రెండవ క్లిప్పింగ్‌ను పరిశీలించగా ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ లోగోను మార్ఫ్ చేసి ‘మన ఆంధ్రజ్యోతి’ అని మార్చినట్లుగా గురించాం.

వైరల్ క్లిప్పింగ్‌లో ఇవ్వబడిన ‘www.manaandhrajyothy.com’ అనే వెబ్సైట్ మనుగడలో లేదని గుర్తించాం. డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ రిజిస్టర్ కాలేదని, ఇది ప్రస్తుతం అమ్మకానికి ఉందని తెలిసింది.

స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ‘మన ఆంధ్రజ్యోతి’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. అలాగే, ఆంధ్రజ్యోతి పత్రిక అధికారిక వెబ్సైట్, ఈ-పేపర్లో కూడా ఈ వార్త ప్రచురించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
గతంలో కూడా ప్రముఖ దినపత్రికల పేర్లను అనుకరిస్తూ నకిలీ పేపర్ క్లిప్పింగ్స్ వైరల్ అయినప్పుడు Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో ప్రచారంలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్. ఈ పేర్లతో ఎటువంటి వార్తాపత్రికలు మనుగడలో లేవు.


