Fake News, Telugu
 

2016 వీడియోని షేర్ చేస్తూ, కేరళలోని హిందువుల బంగ్లాలపై ముస్లింలు రాళ్లు రువ్వి, ఇల్లు ఖాళీ చెయ్యమని బెదిరించారని తప్పుడు కథనం ప్రచారం చేస్తున్నారు.

0

ఇటీవలి కేరళలోని హిందూ బంగ్లాలపై (ఇళ్లపై) ముస్లిం అబ్బాయిలు రాళ్లు రువ్వుతూ, వారిని ఖాళీ చేయమని బెదిరిస్తున్న విజువల్స్‌ను చూపుతున్నట్లు పేర్కొంటూ, కొంతమంది వ్యక్తులు ఒక భవనంపై రాళ్లు రువ్వుతున్న వీడియో ఒకటి విస్తృతంగా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవికతను తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: కేరళలోని హింధువుల బంగ్లాలపై ముస్లిం అబ్బాయిలు రాళ్లు రువ్వి, వారిని ఖాళీ చేయమని బెదిరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ విజువల్స్ ఆగస్టు 2016కి చెందినవి.  ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు కేరళలోని నాదపురంలో CPI(M) నాయకుల ఇళ్లు మరియు కార్యాలయాలపై దాడి చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. దాడికి కేవలం రెండు రోజుల ముందు, 13 ఆగస్టు 2016న IUML కార్యకర్త అస్లాం హత్య జరిగింది, దీనికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. రాజకీయ కోణంతో జరిగిన దాడిని మత కోణంతో షేర్ చేస్తున్నారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే లాగా ఉంది. .

వైరల్ వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లని ఉపయోగించి, ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, మనోరమ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ 15 ఆగస్టు 2016న అప్‌లోడ్ చేసిన న్యూస్ రిపోర్టు ఒకటి దొరికింది. ఈ రిపోర్టు ప్రకారం, కేరళలోని నాదపురంలో BJP మరియు కాంగ్రెస్‌తో పాటు CPI(M) నాయకుల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ దాడికి పాల్పడిన 50 మందిపై కేసులు నమోదు చేశారు. మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ దాడికి రెండు రోజుల ముందు అంటే 13 ఆగస్టు 2016న సీపీఐ(ఎం) కార్యకర్తలు IUML కార్యకర్త అస్లాంని హత్య చేసారని, ఆ హత్యకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని మీడియా రిపోర్ట్ చేసింది.

22 జనవరి 2015న ‘నాదాపురం’ సమీపంలోని తునేరి వద్ద 10 మంది సభ్యులతో కూడిన IUML కార్యకర్తల గుంపుతో హత్యకు గురైన సీపీఐ(ఎం) కార్యకర్త శిబిన్ హత్య కేసులో అస్లాం ఒక నిందితుడు. ఈ కేసులో అస్లాం మూడవ నిందితుడు. అయితే విచారణలో నిర్దోషి అని తేలడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. అస్లాం కేరళకు తిరిగి వచ్చినప్పుడు, అతను 13 ఆగస్టు 2016న దారుణంగా చంపబడ్డాడు. ఈ హత్యలో పాల్గొన్న మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, నాదపురం, CPI(M) మరియు IUML మొదలైన వివిధ పార్టీల ప్రమేయం ఉన్న రాజకీయ ప్రేరేపిత హింసకు ప్రసిద్ధి చెందింది. ఫిబ్రవరి 2012లో కన్నూర్‌లో IUML పార్టీకి చెందిన అరియిల్ షుకూర్ అనే వ్యక్తి హత్య తర్వాత ఈ పార్టీల మధ్య రాజకీయ విభేదాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత, వరుసగా 2015లో షిబిన్, 2016లో అస్లాం హత్యలతో మళ్లీ హింస చెలరేగింది.

చివరిగా, 2016లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)  కార్యకర్త హత్యకు ప్రతీకారంగా IUML కార్యకర్తలు కేరళలోని నాదపురంలో CPI(M) ఇళ్లు మరియు కార్యాలయాలపై దాడి చేసిన పాత వీడియోను ఇటీవల కేరళలోని హిందూ ఇళ్లపై ముస్లిం అబ్బాయిలు రాళ్లు రువ్వి, వారిని బెదిరించిన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll