Fake News, Telugu
 

బెల్జియంని ముస్లిం దేశంగా ప్రకటించాలని ప్రస్తుతం ఎటువంటి నిరసనలు జరగట్లేదు

0

బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రహదారులపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. బెల్జియంలో మొదటిసారిగా గెలిచిన ముస్లిముల పార్టీ నిరసనలు చేపడుతుందంటూ ఒక ఫోటోని కూడా పోస్టులో షేర్ చేసారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రహదారులపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

ఫాక్ట్ (నిజం): బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ప్రస్తుతం ఎటువంటి నిరసనలు జరగట్లేదు. 2012లో బెల్జియంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఇస్లామిక్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గెలుపొందారు. ఈ పార్టీ బెల్జియంలో షరియా చట్టాన్ని అమలు చేసేలా కృషి చేయడమే తమ లక్ష్యమని బహిరంగంగానే ప్రకటించింది. ఐతే 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ నుండి ఒక్కరు కూడా గెలవలేదు. పైగా బెల్జియంలో విద్యా సంస్థల్లో హెడ్ స్కార్ఫ్, హాలాల్ వంటివి నిషేదిస్తూ బెల్జియం పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను అక్కడి రాజ్యాంగ కోర్టులు కూడా సమర్దించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల కాలంలో బెల్జియం దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని నిరసనలు జరిగలేదు. ఒకవేళ నిజంగా అలాంటి నిరసనలు జరిగి ఉంటే, వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయానికి సంబంధించి మాకు తాజా వార్తా కథనాలేవి లభించలేదు.

ఐతే 2012లో బెల్జియంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఇస్లామిక్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గెలుపొందారు. ఐతే ఇస్లాం పార్టీ అనేది ఇస్లామిస్ట్ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది, బెల్జియంలో షరియాను చట్టాన్ని అమలు చేసేలా కృషి చేయడమే తమ లక్ష్యమని బహిరంగంగా ప్రకటించి, అప్పట్లో ఈ ఉద్దేశంతో కొన్ని ప్రదర్శనలు కూడా నిర్వహించింది. ఐతే 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ నుండి ఒక్కరు కూడా గెలవలేదు.

ఇదిలా ఉంటే, 2018లో బెల్జియంలో షరియా చట్టాన్ని అమలు చేయాలనీ కోరుతున్న సంఘాలని లేదా పార్టీలను బ్యాన్ చేసేలా ఒక బిల్లును ప్రవేశపెట్టబోతునట్టు పీపుల్స్ పార్టీ ప్రకటించింది. అలాగే 2019 మరియు 2020లో విద్యా సంస్థల్లో హెడ్ స్కార్ఫ్ మరియు మతపరమైన పద్దతుల్లో (హాలాల్) జంతువులను చంపడం వంటివి నిషేదిస్తూ బెల్జియం పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను సమర్దిస్తూ అక్కడి రాజ్యాంగ కోర్టు తీర్పు చెప్పింది.   

పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకి బెల్జియంకి ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2018లో ప్రచురించిన కొన్ని పాకిస్తానీ వార్తా కథనాలు మాకు లభించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బెల్జియంలో ఇస్లాం ప్రాభల్యం పెరుగుతున్నట్టు పలు కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ప్రస్తుతం బెల్జియంని ఇస్లాం దేశంగా ప్రకటించాలని ఎటువంటి నిరసనలు జరగట్లేదు.

చివరగా, బెల్జియంని ముస్లిం దేశంగా ప్రకటించాలని ప్రస్తుతం ఎటువంటి నిరసనలు జరగట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll