Fake News, Telugu
 

వీడియోలో హరినామ సంకీర్తన చేస్తున్నది ప్రఖ్యాత భక్తి గాయకురాలు గీతాంజలి రాయ్, మహమ్మద్ రఫీ మనవరాలు కాదు.

0

హిందూ సాంప్రదాయ వేషధారణలో హరినామ సంకీర్తన చేస్తున్న ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ మనవరాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ వేషధారణలో హరినామ సంకీర్తన చేస్తున్న ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ మనవరాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో హరినామ సంకీర్తన చేస్తున్నది భక్తి గాయకురాలు గీతాంజలి రాయ్, మహమ్మద్ రఫీ మనవరాలు కాదు. 2013లో చిన్మయ్ సంస్థ వారు నిర్వహించిన భజన కార్యక్రమంలో లో గీతాంజలి రాయ్ ఈ ప్రదర్శన ఇచ్చినట్టు విశ్లేషణలో తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘Spirtual Mantras and Bhajans’ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని 2017లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియోలో హరినామ సంకీర్తన చేస్తున్నది గీతాంజలి రాయ్ అని ఆ వీడియో వివరణలో తెలపారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియో గురించిన సమాచారం కోసం వెతకగా, పోస్టులో షేర్ చేసిన అదే వీడియోని గీతాంజలి రాయ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ‘14 ఏప్రిల్ 2013’ నాడు అప్లోడ్ చేసినట్టు తెలిసింది. చిన్మయ సంస్థ వారు నిర్వహించిన భజన కార్యక్రమంలో, గీతాంజలి రాయ్ చేసిన ప్రదర్శనకి సంబంధించిన వీడియో అని అందులో తెలిపారు.

పూణే నగరానికి చెందిన ప్రఖ్యాత భక్తి గాయకురాలు గీతాంజలి రాయ్, వివిధ దేశాలలో జరిగే భజన కార్యక్రమాల్లో అలాగే, కాన్సర్ట్ లలో ప్రదర్శన ఇస్తుంటారు.  ఆమె ‘ఆర్ట్ అఫ్ లివింగ్’ సంస్థలో కూడా సభ్యురాలుగా ఉన్నారు. గీతాంజలి రాయ్ చేసిన మరికొన్ని ప్రదర్శనలని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పోస్టులోని ఇదే వీడియోని చూపిస్తూ ఇదివరకు కొందరు గీతాంజలి రాయ్ ని మహమ్మద్ రఫీ కూతురు అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. అలాగే, గీతాంజలి రాయ్  కాకుండా మరికొందరిని కూడా మహమ్మద్ రఫీ మనవరాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీరికి ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫికి ఎటువంటి సంబంధము లేదు.

చివరగా, వీడియోలో హరినామ సంకీర్తన చేస్తున్నది ప్రఖ్యాత భక్తి గాయకురాలు గీతాంజలి రాయ్, మహమ్మద్ రఫీ మనవరాలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll