ప్రీ-వెడ్డింగ్ షూట్ లో భాగంగా ఒక అమ్మాయి, అబ్బాయి శ్మశానంలో గుంట తవ్వి అందులో పడుకొని ఫోటో దిగారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ప్రీ-వెడ్డింగ్ ఘాట్ లో భాగంగా ఒక అమ్మాయి, అబ్బాయి శ్మశానంలో గుంటలో దిగిన ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో “నీ పై ప్రేమ చావదే” అనే ఒక ప్రైవేట్ పాట వీడియోలోని సన్నివేశానికి సంబంధించినది. ఇది ప్రీ-వెడ్డింగ్ షూట్ కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ పోస్టులోని కామెంట్లను పరిశీలించగా, ఇది ప్రీ-వెడ్డింగ్ ఘాట్ కాదని, ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ పాటలోని సన్నివేశమని కొందరు చెప్పడం గమనించాం. దీని ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా, “నీ పై ప్రేమ చావదే” అనే ఒక పాట వీడియోలో ఆఖరి సన్నివేశంలో వైరల్ ఫొటోలో ఉన్న అమ్మాయి, అబ్బాయి అదే రీతిలో గుంటలో పడుకొని ఉండటం గుర్తించాం.
ఈ సన్నివేశంలో కనిపిస్తున్న నటీనటుల పేర్లు శివకృష్ణ మరియు హేమ అని వీడియో కింద వివరణలో పేర్కొన్నారు. కథలో భాగంగా పెళ్లికూతురు, ఆమె ప్రియుడు చనిపోతే ఇలా ఇద్దరినీ ఒకేసారి పూడుస్తారు. ఈ పాత చిత్రీకరణకు సంబంధించిన వీడియోలో కూడా ఈ దృశ్యాలను చూడవచ్చు.
చివరిగా, ఒక ప్రైవేట్ పాట షూటింగ్ దృశ్యాలను ప్రీ-వెడ్డింగ్ ఘాట్ లో ఒక అమ్మాయి, అబ్బాయి శ్మశానంలో గుంట తవ్వి అందులో పడుకొని ఫోటో దిగారని తప్పుగా షేర్ చేస్తున్నారు.