Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌ పదవి పోటీకి టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేసిందన్న వార్తలో నిజం లేదు

0

కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌ పదవి పోటీకి టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్రానికి పంపించగా తెలంగాణ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌ పదవి పోటీకి టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేసింది; తెలంగాణ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్పంచ్ అభ్యర్థి విద్యార్హతలకు సంబంధించి 10th పాస్ తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనలు పంపినట్టు రిపోర్ట్స్ లేవు. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ అభ్యర్థులకు విద్యార్హతలు నిర్దేశించే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా తెలంగాణ ప్రభుత్వం చివరిసారిగా 2018లో పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేసింది. ఈ చట్టంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హతలను నిర్దేశించలేదు. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఇదే చట్టం అమలులో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేస్తూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు.

2017లో లోక్‌సభ అంచనాల కమిటీ దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ  కేంద్రానికి నివేదిక అందజేసింది, దీనిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికల్లో పోటీ అర్హతలకు సంబంధించి టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేస్తూ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.

తెలంగాణ ప్రభుత్వం చివరిసారిగా 2018లో పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేసి కొత్తగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 చట్టాన్ని ప్రవేశపెట్టింది. కాని ఈ చట్టంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. ప్రస్తుతానికి కూడా రాష్ట్రంలో ఇదే చట్టం అమలులో ఉంది.

కాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఈ క్రమంలోనే గతంలో రాజస్థాన్ మరియు హర్యానా రాష్ట్రాలు సర్పంచ్ అభ్యర్థి 8th మరియు 10th పాస్ అయ్యుండాలని చట్టాలు చేసాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలా పంచాయతీ చట్టానికి సవరణలు చేసే ఉద్దేశంలో ఉంది అని చెప్పే రిపోర్ట్స్ కూడా లేవు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌ పదవి పోటీకి టెన్త్‌ పాసవడం తప్పనిసరి చేసిందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll