Fake News, Telugu
 

‘భారతదేశంలోనే ఉంటూ ఉక్రెయిన్‌ విద్యార్థినిగా దుష్ప్రచారం చేసిన వైశాలి యాదవ్ ఆరెస్ట్’ అనే వార్త తప్పు

0

UPలోని సమాజ్వాదీ పార్టీకి చెందిన మహేంద్ర యాదవ్ కుమార్తె వైశాలి యాదవ్ తాను ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నట్లు…ఇండియన్ ఎంబసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదనీ…సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది. నిజానికి ఈమె అసలు ఉక్రెయిన్‌లో చదవడం లేదు. హైస్కూల్ కూడా పాస్ కాలేదు. UP పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెడితే…తన తండ్రే తన చేత ఆ అబద్దపు ప్రచారం చేయించాడని ఒప్పుకొంది,” అని చెప్తూ కొంత మంది ఒక పోస్ట్‌ని   సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హైస్కూల్ కూడా పాస్ కాని వైశాలి యాదవ్ ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నట్లు, భారత రాయబార కార్యాలయం వారిని పట్టించుకోవట్లేదని దుష్ప్రచారం చేసింది. తను భారతదేశంలోనే ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేసారు.

ఫాక్ట్: ఉక్రెయిన్‌లో చదువుతున్న వైశాలి యాదవ్ గత సంవత్సరం పంచాయతీ ఎన్నికల సమయంలో భారతదేశానికి వచ్చి, ఎన్నికల్లో నిలబడి గ్రామ సర్పంచ్ అయినట్టు తెలిసింది. సర్పంచ్ అయ్యాక తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లింది. ‘వీడియో చేసినప్పుడు తను భారతదేశంలోనే ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేసారు’, అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ‘దైనిక్ భాస్కర్’ వారికి  హర్డోయ్ ఎస్పీ తెలిపారు. అదే విషయం వైశాలి యాదవ్ కూడా మరో వీడియోలో చెప్పింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

వైశాలి యాదవ్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, తను ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ఒక వీడియో పెట్టినట్టు తెలిసింది. ఆ వీడియోని ‘హిందుస్థాన్’ వారి ట్వీట్‌లో చూడవచ్చు.

ఉక్రెయిన్‌లో చదువుతున్న వైశాలి యాదవ్ గత సంవత్సరం పంచాయతీ ఎన్నికల సమయంలో భారతదేశానికి వచ్చి, ఎన్నికల్లో నిలబడి గ్రామ సర్పంచ్ అయినట్టు తెలిసింది. సర్పంచ్ అయ్యాక తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లి, అక్కడి నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ‘అమర్ ఉజాలా’ వారు డిసెంబర్ 2021లో ప్రచురించిన అర్టికల్‌లో చదవచ్చు. అయితే, వీడియో వైరల్ అయ్యాక ఆ విషయం తెలుసుకున్న అధికారులు, సర్పంచ్ అయ్యాక తను ఉక్రెయిన్‌లో ఎలా చదవుతుందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

‘వీడియో చేసినప్పుడు తను భారతదేశంలోనే ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేసారు’, అని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో, ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని హర్డోయ్ ఎస్పీ తెలిపినట్టు ‘దైనిక్ భాస్కర్’ వారు రిపోర్ట్ చేసారు. అంతేకాదు, తను ఉక్రెయిన్‌లోనే ఉండేది అని, అయితే తాజాగా రొమేనియాకి చేరుకున్నట్టు చెప్తూ వైశాలి యాదవ్ చేసిన మరో వీడియోని ‘దైనిక్ భాస్కర్’ వెబ్సైటులో చూడవచ్చు. తనపై ఫేక్ పోస్టులు పెడుతున్నారని తను చెప్పడం వీడియోలో చూడవచ్చు.

Update (MARCH 4, 2022):

అదే క్లెయిమ్ పెట్టి, మరో ఫోటోని కూడా కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే, ఆ ఫోటో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఫోటోలో ఉన్నది వైశాలి యాదవ్ కాదని తెలిసింది. ఆ ఫోటోలో ఉన్నది కమలా చౌదరి అని, ఆయుధాలతో వీడియోలు చేసి పోలీసులకు ఛాలెంజ్ విసరడంతో తనని అరెస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, కమలా చౌదరిని అరెస్ట్ చేసింది రాజస్థాన్ పోలీసులు; ఉత్తరప్రదేశ్ పోలీసులు కాదు. ఆమె అరెస్ట్ గురించి నగౌర్ పోలీసులు పెట్టిన ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు. కమలా చౌదరిని అరెస్ట్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, భారతదేశంలోనే ఉంటూ ఉక్రెయిన్‌ విద్యార్థినిగా దుష్ప్రచారం చేసిన వైశాలి యాదవ్ ఆరెస్ట్ అనేది తప్పుడు వార్త.

Share.

About Author

Comments are closed.

scroll