Fake News, Telugu
 

బరేలీలో జరిగిన ఘర్షణల వీడియోను హల్ద్వానీలో చోటుచేసుకున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

8 ఫిబ్రవరి 2024న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అనధికార మదర్సా మరియు మసీదు కూల్చివేత ఆపరేషన్ సందర్భంగా మతపరమైన గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో, కొంతమంది ముస్లిం పురుషులు గుంపులుగా రోడ్డు పైన పరిగెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘రోహింగ్యా మరియు బంగ్లాదేశ్ శరణార్థుల ఇస్లామిక్ మూక భారత పోలీసులపై దాడి చేసింది’ అని రాస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రోహింగ్యా మరియు బంగ్లాదేశ్ శరణార్థుల ఇస్లామిక్ మూక భారత పోలీసులపై దాడిని చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం):  ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ నాయకుడు తౌకీర్ రజాఖాన్‌ జ్ఞానవాపి కేసుపై నిరసన వ్యక్తం చేస్తూ, ‘జైలు భరో’ (జైళ్లను నింపండి) ఉద్యమానికి పిలుపునిచ్చిన తరువాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా రజాఖాన్‌ యొక్క అనుచరులు నిరసనలు చేస్తున్న దృశ్యం ఇది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రకారం ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ గంగాపూర్, బరేలీలో చోటుచేసుకుంది, ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ దావాకు సంబంధించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ‘బరేలీలో శాంతిని వెతుక్కుంటూ బయలుదేరిన శాంతి దూతలు’ అనే టైటిల్ తో ఇదే  వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చెయ్యటం గమనించాం.

వైరల్ విడియోలో హిందీలో “సాహు గోపీనాథ్” పేరుతో సైన్ బోర్డు ఉన్నట్టు గమనించాం. దీన్ని ఆధారంగా తీసుకొని గూగుల్ మ్యాప్స్ లో వెతికితే, ఈ స్థలం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని గంగాపూర్ అని మేము గుర్తించాము. గూగుల్ స్ట్రీట్ వ్యూ, వైరల్ వీడియో యొక్క విజువల్స్‌తో సరిపోలింది. రెండింటి పోలిక క్రింద చూడవచ్చు.


ఈ సంఘటనకు సంబంధించిన వార్తా నివేదికలను కూడా మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ నాయకుడు తౌకీర్ రజాఖాన్‌ జ్ఞానవాపి కేసుపై నిరసన వ్యక్తం చేస్తూ, ‘జైలు భరో’ (జైళ్లను నింపండి) ఉద్యమానికి పిలుపునిచ్చిన తరువాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా రజాఖాన్‌ యొక్క అనుచరులు నిరసనలు చేశారు.

బరేలీ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడుతూ ఒక వీడియోను తమ అధికారిక X హ్యాండిల్ల్లో పోస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మౌలానా తౌకీర్ ప్రసంగం ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తరువాత, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఘర్షణకు కారణమైన వారిపై దర్యాప్తు చేశారు.

ఇకపోతే, హల్ద్వానీలో జరిగిన గొడవల దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, బరేలీలో జరిగిన ఘర్షణల వీడియోను హల్ద్వానీలో జరిగిన దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll