Fake News, Telugu
 

విశాఖపట్నంలో గత సంవత్సరం ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు

0

‘గ్రామంలో అభివృద్ధి శూన్యం అన్ని ప్రశ్నించినందుకు దళిత యువకుడిని కట్టేసి చెపులతో దాడి చేసిన వైసీపీకి చెందిన ఎంపీటీసీ అనుచరులు’ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలోని ఘటన ఇటీవల జరిగినట్టు షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: గ్రామంలో అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు దళిత యువకుడిని వైసీపీ కార్యకర్తలు చెట్టుకి కట్టేసి చెప్పులతో దాడి చేసిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2022 జూన్‌లో విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో రిపోర్ట్ అయింది. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన వార్తా కథనాల ప్రకారం ఘటనలో రాజకీయ కోణం ఉన్నప్పటికీ, పోలీసుల FIRలో మాత్రం మొబైల్ ఫోన్ దొంగతనం ఆరోపణతో వ్యక్తిని కొట్టినట్టు ఉంది. ఐతే ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు దళితులే. కారణాలు ఏవైనప్పటికీ ఈ ఘటన మాత్రం ఈ మధ్య జరిగింది కాదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఘటన ఇటీవల జరిగింది కాదు, ఈ ఘటన 2022 జూన్ నెలలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో చోటు చేసుకుంది. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటనను గత సంవత్సరం జూన్‌లో వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. “వి. జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు, సూరిబాబు గ్రామంలోని ఓ వైకాపా నాయకుడికి ముఖ్య అనుచరులు. వారం క్రితం తారకేశ్వరరావు మద్యం తాగి వైకాపా నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. మర్నాటి ఉదయం తన సెల్ఫోన్ దొంగిలించాడన్న ఆరోపణతో తారకేశ్వరరావును సూరిబాబు చెట్టుకు కట్టి చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడని” వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఐతే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు దళితులే. కాగా తారకేశ్వరరావు ఇచ్చిన కంప్లైంట్ ఆదారంగా  పోలీసులు రిజిస్టర్ చేసిన FIRలో మాత్రం సెల్ఫోన్ దొంగతనం నెపంతో తనపై దాడి జరిగిందని మాత్రమే ఉంది.

ఐతే ఆ తరవాత వీరిద్దరూ ఈ కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్నారు. ఈ వివరాల బట్టి కారణాలు ఏవైనప్పటికీ ఈ ఘటన మాత్రం ఈ మధ్య జరిగింది కాదని స్పష్టమవుతుంది. ఐతే ఈ వీడియో ఇటీవల జరిగిన ఘటనగా ప్రస్తుతం షేర్ చేస్తున్నారు.

చివరగా, విశాఖపట్నంలో గత సంవత్సరం ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll