ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వారికి ప్రమోషన్లు ఉండవని, వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించవు అని ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రభుత్వ పథకాలను పొందకుండా నిరోధించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేస్తుంది.
ఫాక్ట్(నిజం): పలు రిపోర్ట్స్ ప్రకారం, ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లు (The Uttar Pradesh Population (Control, Stabilization, and Welfare) Bill, 2021) యొక్క ముసాయిదాను 2021లో రాష్ట్ర లా కమిషన్ రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకుండా లేదా ఇప్పటికే అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే పదోన్నతులు పొందకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి లబ్ది పొందకుండా నిషేధించబడతారు. ఇంకా, ఇద్దరు పిల్లల పాలసీకి కట్టుబడి ఉండే జంటలకు ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీలు మరియు ఇతర ప్రత్యేక ప్రయోజనాల రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లు 2021ను ఇంకా శాసనసభలో ప్రవేశపెట్టలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠినమైన ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేస్తుందా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, జూలై 2021లో వెలువడిన పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, జూలై 2021లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ పాపులేషన్ పాలసీ 2021-2030 ముసాయిదా బిల్లును ఆవిష్కరించారు. ఈ బిల్లును ఉత్తరప్రదేశ్ రాష్ట్ర లా కమిషన్ రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు (The Uttar Pradesh Population (Control, Stabilization, and Welfare) Bill, 2021) ప్రకారం, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకుండా లేదా ఇప్పటికే అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే పదోన్నతులు పొందకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి లబ్ది పొందకుండా నిషేధించబడతారు. ఇంకా, ఇద్దరు పిల్లల పాలసీకి కట్టుబడి ఉండే జంటలకు ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీలు మరియు ఇతర ప్రత్యేక ప్రయోజనాల రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.
అయితే ఈ జనాభా నియంత్రణ బిల్లును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందా?లేదా? అనే సమాచారం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో వెతకగా మాకు ఎలాంటి సమాచారం లభించలేదు. తర్వాత, మేము ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వెబ్‌సైట్‌లో ఆమోదించబడిన బిల్లులు లేదా వివిధ సంవత్సరాల్లో అమలు చేయబడిన చట్టాల జాబితాను పరిశీలించగా, ఈ జనాభా నియంత్రణ బిల్లు లేదా ఇద్దరు పిల్లల పాలసీ ఆమోదించబడిన బిల్లుల జాబితాలో కనిపించలేదు. దీన్ని బట్టి ఈ జనాభా నియంత్రణ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని తెలుస్తుంది.
చివరగా, 12 జూన్ 2024 నాటికి, జనాభా నియంత్రణ బిల్లును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయలేదు, ఇది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలను ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలను పొందకుండా నిరోధిస్తుంది.