Fake News, Telugu
 

అమెరికా ప్రభుత్వం అంబేద్కర్ ఫోటోని 100 డాలర్ల కరెన్సీ నోటు పై ముద్రించలేదు

0

గత 125 సంవత్సరాల చరిత్రలో కొలంబియా యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్ధులలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరని సర్వే నిర్వహిస్తే, అతను భారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్. అంబేద్కర్ అని అమెరికా ప్రభుత్వం గుర్తించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఈ ఘనతకి గుర్తుగా అమెరికా ప్రభుత్వం తమ 100 డాలర్ల కరెన్సీ నోటు పై అంబేద్కర్ ఫోటోని ముద్రించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: డా బి.ఆర్. అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదివి ప్రపంచాన్ని ప్రభావితం చేసినందుకు గాను అమెరికా ప్రభుత్వం అతని ఫోటోని 100 డాలర్ల కరెన్సీ నోటు పై ముద్రించింది.

ఫాక్ట్ (నిజం): కొలంబియా యూనివర్సిటీ లో చదివి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పూర్వ విద్యార్ధులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎటువంటి సర్వే నిర్వహించలేదు. కొలంబియా యూనివర్సిటీ మాత్రం తమ వెబ్సైటులో డా బి.ఆర్. అంబేద్కర్ ని అత్యంత ప్రభావవంతమైన పీహెచ్‌డీ (PHD) విద్యార్ధిగా గుర్తించింది. అమెరికా 100 డాలర్ల కరెన్సీ నోటు పై ముద్రించబడి ఉన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటో, అంబేద్కర్ ఫోటో కాదు. అమెరికా ఇప్పటివరకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటోని తప్ప మిగితా ఎవరి ఫోటోలని 100 డాలర్ల నోటు పై ముద్రించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, అమెరికా ప్రభుత్వం కొలంబియా యూనివర్సిటీ లో చదివి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పూర్వ విద్యార్ధులకు సంబంధించి ఎటువంటి సర్వే నిర్వహించలేదని తెలిసింది.

కొలంబియా యూనివర్సిటీ, తమ పూర్వ విద్యార్ధులలో ఒకరైన డా బి.ఆర్. అంబేద్కర్ గురించి తమ వెబ్సైటులో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ నుండి MA మరియు PHD పట్టాలు పొందినట్టు తమ వెబ్సైటులో తెలిపారు. కొలంబియా యూనివర్సిటీ, తమ వెబ్సైటులో అంబేద్కర్ ని అత్యంత ప్రభావవంతమైన పీహెచ్‌డీ (PHD) విద్యార్ధిగా గుర్తించింది.

అమెరికా కరెన్సీ నోట్లకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతకగా, వాటికి సంబంధించిన వివరాలు అమెరికా కరెన్సీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వెబ్సైటు ‘uscurrency.gov’ లో లభించాయి. అమెరికా డాలర్ కరెన్సీ నోట్ల యొక్క డిజైన్ ఇప్పటి వరకు నాలుగు సార్లు మారినప్పటికీ, వాటి పై  బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటోని తప్ప మిగితా ఎవరి ఫోటోలని ఇప్పటివరకు ముద్రించలేదని ఈ వెబ్సైటులో తెలిపారు. దీన్ని బట్టి, అమెరికా ప్రభుత్వం తమ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించలేదని తెలుస్తుంది.

అమెరికా 100 డాలర్ కరెన్సీ నోటు పై మనకు నచ్చిన ఫోటోని ముద్రించుకునే విధంగా  కొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్సైట్లు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. ‘fivesquid’ వెబ్సైటుని ఉపయోగించి అమెరకా 100 డాలర్ కరెన్సీ నోటు పై బరాక్ ఒబామా ఫోటోని ముద్రించిన విధానాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా రూపొందించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒబామా ఫోటో ఉన్న నోటు, పోస్ట్ లో అంబేద్కర్ ఉన్న నోటు మీద ఒకే సీరియల్ నంబర్ ఉండడం మనం గమనించొచ్చు. అంటే, ఆ ఫోటో కూడా ఇలాంటి ఒక గ్రాఫిక్ వెబ్సైటు లో తయారు చేసిందే.

చివరగా, కొలంబియా యూనివర్సిటీ లో చదివి ప్రపంచాన్ని ప్రభావితం చేసినందుకు గాను అమెరికా ప్రభుత్వం తమ 100 డాలర్ కరెన్సీ నోటు పై అంబేద్కర్ ఫోటోని ముద్రించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll