Fake News, Telugu
 

అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించలేదు

0

‘అమెరికాలో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు’ అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్:  అమెరికాలో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు.

ఫాక్ట్(నిజం):  అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించలేదు. అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని విద్యా దినోత్సవంగా గుర్తించిందన్న వార్తలో నిజంలేదు. కాకపోతే గతంలో రెండు సార్లు అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికి, ఈ తీర్మానాలు ప్రస్తుతం సబ్ కమిటీల పరిశీలనలో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించలేదు:

అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని (ఏప్రిల్ 14) అధికారికంగా గుర్తించలేదు. ఒకవేళ నిజంగా గుర్తించి ఉంటే, ఈ విషయాన్ని మీడియా రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి వార్తా కథనాలేవి కనిపించలేదు.

అమెరికా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెలవు రోజులకు సంబంధించిన లిస్టులో ఏప్రిల్ 14కు ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు.

కాకపోతే గతంలో అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. రో ఖన్నా ఇదే విషయానికి సంబంధించి 2020లో ఒకసారి  & 2021లో ఇంకోసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.

ఐతే ఈ రెండు తీర్మానాలపై అమెరికన్ కాంగ్రెస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తీర్మానాలు ప్రవేశపెట్టిన రెండు సందర్భాలలో వాటిని సబ్ కమిటీలకు రెఫర్ చేసారు.

అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరిన సందర్భాలు ఉన్నాయి. 2016లో అంబేడ్కర్ 125వ జయంతి సంధర్భంగా మొదటిసారి ఐక్యరాజ్య సమితిలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంలో అంబేడ్కర్ జయంతిని ‘అంతర్జాతీయ సమానత్వ దినోత్సవం’ గా ప్రకటించాలని కోరారు. ఐతే ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించలేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14ను ‘ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం’గా నిర్వహిస్తుంది.

అమెరికాలోని పలు రాష్ట్రాలు అంబేడ్కర్ జయంతిని గుర్తించాయి:

గత సంవత్సరం అమెరికాలోని కొలరాడో మరియు మిచిగాన్ రాష్ట్రాలు ఏప్రిల్ 14ని ‘డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఈక్విటీ డేగా’ ప్రకటించాయి. మిచిగాన్ రాష్ట్రం ఏప్రిల్ 14ను ఈక్విటీ డేగా ప్రకటిస్తూ విడుదల చేసిన సర్టిఫికేట్ ఇక్కడ చూడొచ్చు.

అంతకు ముందు 2021లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ కూడా అంబేడ్కర్ జయంతిని ‘డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఈక్విటీ డేగా’ గుర్తించింది.

మనదేశంలో కూడా పలు రాష్ట్రాలు అంబేడ్కర్ జయంతిని ప్రత్యేకంగా గుర్తించాయి :

మనదేశంలో కూడా పలు రాష్ట్రాలు అంబేడ్కర్ జయంతిని ప్రత్యేకంగా జరుపుతున్నాయి.  మహారాష్ట్ర ప్రభుత్వం 2017లోనే అంబేడ్కర్ జయంతిని ‘నాలెడ్జ్ డేగా’ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇటీవల 2022లో తమిళనాడు ప్రభుత్వం గత సంవత్సరం నుండి అంబేడ్కర్ జయంతిని ‘సమానతా దినోత్సవం’ (Equality Day)గా జరుపుకొనున్నట్టు నిర్ణయించాయి.

ఐతే భారత్ ప్రభుత్వం కూడా అంబేడ్కర్ జయంతిని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది తప్ప, ఆ రోజుకు అధికారికంగా ఒక పేరు పెట్టలేదు.

చివరగా, అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll