Fake News, Telugu
 

03 నవంబర్ 2025న జైపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా; అతను ముస్లిం కాదు

0

03 నవంబర్ 2025న, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “భారతదేశంలో ఇకనుండి బాంబు బ్లాస్టులు జరగవు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి, 5/11/25న జైపూర్‌లోని లోహా మండి వద్ద టిప్పర్ ఢీకొని 50-60 మంది మరణించారు, డ్రైవర్ ఎవరో తెలుసా టురక” అంటూ ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధిచిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ముస్లిం అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
(గమనిక: ఈ వీడియోలో కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి)

క్లెయిమ్: 03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ముస్లిం.

ఫాక్ట్(నిజం): 03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ముస్లిం కాదు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా అని, అతను హిందువు అని జైపూర్ పోలీస్ కమిషనరేట్‌లోని చోము(Chomu) సర్కిల్, ACP ఉషా యాదవ్ మాకు (Factly) తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, 03 నవంబర్ 2025న, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని హర్మాడ (Harmada/Harmara) పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహమండి ప్రాంతంలో మద్యం మత్తులో ఒక ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వేగంగా వాహనాలను ఢీకొంటూ పోయాడు. ఈ బీభత్సంలో ఎదురుగా వచ్చిన పలు కార్లు, మోటార్‌సైకిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా అని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం, జైపూర్ పోలీస్ కమిషనరేట్‌లోని చోము(Chomu) సర్కిల్, ACP ఉషా యాదవ్‌ను మేము (Factly) సంప్రదించగా, వారు మాతో (Factly) మాట్లాడుతూ, “ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ముస్లిం కాదు, అతని పేరు కళ్యాణ్ మీనా, అతను హిందువు, అతను మీనా కులానికి చెందినవాడు” అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి హర్మాడ పోలీస్ స్టేషన్‌లో కేసు (FIR 544/2025) నమోదు చేయబడిందని కూడా పేర్కొన్నారు.

చివరగా, 03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా. అతను ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll