Fact Check, Fake News, Telugu
 

అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించలేదు.

0

అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారని ప్రైమ్ 9 అనే వార్తా సంస్థ తమ ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారు.

ఫాక్ట్(నిజం): అమెరికాలో తెలుగే కాకుండా ఇంకా ఏ భాషని కూడా అధికారిక భాషగా గుర్తించలేదు. కాకపోతే కొన్ని రాష్ట్రాలకు అధికారిక బాషాలున్నప్పటికీ, ఏ రాష్ట్రంలో కూడా తెలుగును అధికారిక భాషగా గుర్తించలేదు. ఎన్నికలకి సంబంధించి కొన్ని పత్రాలను తెలుగులో కూడా అందుబాటులో ఉంచిన మాట నిజమైనప్పటికీ, అది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్తున్నదాని గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, అమెరికాలో ఏ భాషని కూడా అధికారిక భాషగా గుర్తించలేదని మాకు తెలిసింది. ‘ఫెడరల్ లెవెల్ లో అధికారిక భాష అనేది లేదు, ఐతే ఎక్కువగా ఉపయోగించే భాష మాత్రం ఇంగ్లీష్. ఇంకా 300 కంటే ఎక్కవ భాషాల్లో ప్రజలు మాట్లాడి, సంతకం కూడా చేస్తారు’. కొన్ని రాష్ట్రాలు ఇంగ్లీష్ ని తమ అధికారిక భాషగా గుర్తించాయి‘ అని అమెరికా ప్రభుత్వ వెబ్సైటులో ఉంది. ఇంగ్లీష్ ని అధికారిక భాషగా గుర్తించే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి బిల్ పాస్ కాలేదు. 2019లో కూడా ఇంగ్లీష్ ని అమెరికా అధికారిక భాషగా గుర్తించాలని పార్లమెంట్ సభలైన హౌస్ అఫ్ రిప్రెసెంటేటివ్స్ మరియు సెనేట్ లో బిల్లులు ప్రవేశపెట్టారు. 

అమెరికాలో రాష్ట్ర స్థాయిలో మాత్రం కొన్ని రాష్ట్రాలకు అధికారిక భాషలున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రం ఇంగ్లీష్ ని అధికారిక భాషగా గుర్తించగా, అలాస్కా రాష్ట్రం ఇంగ్లీష్ తో పాటు మరో 20 భాషలను అధికారిక భాషలుగా గుర్తించింది. ఐతే ఏ రాష్ట్రంలో కూడా తెలుగును అధికారిక భాషగా గుర్తించలేదు. 

కాలిఫోర్నియా రాష్ట్రంలో, కాలిఫోర్నియా ఎలక్షన్స్ కోడ్ సెక్షన్ 14201 భాషా అవసరాల ప్రకారం, రాబోయే ఎన్నికలలో  ఓటర్లకు సహాయం చేయడానికి తెలుగుతో సహా 14 భాషలను ఇటీవల చేర్చారు. ఐతే కాలిఫోర్నియాలోని అన్ని కౌంటీల్లో తెలుగును ఉపయోగించరు, కేవలం కొన్ని కౌంటీల్లోని కొన్ని ప్రాంతాల్లోనే తెలుగును ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చదవచ్చు.

శాంటా క్లారా కౌంటీ ఎన్నికలకు సంబంధించి విడుదలచేసిన సమాచారం ప్రకారం ఎన్నికలకి సంబంధించిన  facsimile ballot (ఇంగ్లీష్ లో ఉన్న బ్యాలెట్ పేపర్ అర్థమవడానికి తెలుగులో అనువదించబడిన బ్యాలెట్) తోపాటు మరికొన్ని పత్రాలు తెలుగుతో సహా 14 భాషల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఐతే అధికారిక బ్యాలెట్ మాత్రం తెలుగులో అందుబాటులో ఉండదు. 25 జూన్ 2020న శాంటా క్లారాలో జరిగిన ‘Language Accessibility Advisory Committee Meeting Minutes‘ ప్రకారం ‘facsimile ballot ని గుజరాతీ, తమిళ్,తెలుగు, పంజాబీ మరియు నేపాలీ భాషల్లో పొందవచ్చు, ఐతే నవంబర్ లో జరిగే ఎన్నికలకి సంబంధించి అధికారిక బ్యాలెట్ పేపర్ ఈ భాషల్లో అందుబాటులో ఉండదు’. శాంటా క్లారా కౌంటీ వెబ్సైటులో ఎన్నికలకు సంబంధించి తెలుగులోకి అనువదించిన కొన్ని పత్రాలు చూడొచ్చు. ఐతే ఎన్నికలకు సంబంధించి తెలుగు భాషలో సమాచారం అనేది కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఉపయోగిస్తున్నారు, అమెరికా అంతటా కాదు. భాషా సౌలభ్యం, అమెరికాలో భాషా పరమైన మైనారిటీల వోటింగ్ హక్కుల గురించి మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు.

చివరగా, అమెరికాలో ఏ భాషని కూడా అధికారిక భాషగా గుర్తించలేదు, తెలుగును అధికార భాషగా ఏ అమెరికన్ రాష్ట్రం కూడా గుర్తించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll