Fact Check, Fake News, Telugu
 

రికవరీలు చేసే సందర్భాల్లో బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలు చట్టాలలో పేర్కొన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీం కోర్టు సూచించింది

0

వాయిదాలు చెల్లించకపోతే వాహనాన్ని తీసుకెళ్ళే అధికారం ఫైనాన్స్ చేసిన సంస్థలకు ఉంటుందని సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇలా వాయిదాలు కట్టని వారి వాహనాలను బలవంతంగా ఎత్తుకెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేవని కోర్టు స్పష్టం చేసిందని ఈ వార్తలో చెప్తున్నారు. ఇదే అంశంపై వివరణ కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు అభ్యర్ధన వచ్చింది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: వాయిదాలు చెల్లించకపోతే వాహనాన్ని తీసుకెళ్ళే అధికారం ఫైనాన్స్ సంస్థలకు ఉంటుంది – సుప్రీం కోర్టు

ఫాక్ట్(నిజం): ఇది చాలా సంవత్సరాల క్రితం వార్త. 2012లో సుప్రీం కోర్టు ఈ విధంగా అభిప్రాయపడినప్పటికీ, ఆ తరవాత అనేక సందర్భాలలో వాహనాలను బలవంతంగా తీసుకెళ్ళడాన్ని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలు రికవరీ చేసుకోవడానికి సంబంధించి చట్టాలలో పేర్కొన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సూచించింది. RBI, SARFAESI Act, 2002 మరియు ఈ చట్టం కింద రూపొందించిన రూల్స్‌లో పేర్కొన్న నియమాలను పాటించాలని కోర్టు సూచించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇది పాత తీర్పు :

వైరల్ న్యూస్ క్లిప్‌లో చెప్తున్నట్టు వాయిదాలు చెల్లించకపోతే వాహనాలను బలవంతంగా ఎత్తుకెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడాన్ని నిరాకరిస్తూ సుప్రీం కోర్టు అభిప్రాయపడ్డ వార్త నిజమే అయినప్పటికీ ఇది చాలా సంవత్సరాల క్రితం వార్త, సుప్రీం కోర్టు ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు కావు.

ఈ క్లిప్‌లో అందించిన వివరాల ప్రకారం 2012లో సుప్రీం కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. తన వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్ళిన ఫైనాన్స్ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనూప్ శర్మ అనే వ్యక్తి 2009లో వేసిన పిటిషన్‌ను విచారణ జరిపిన కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది (ఇక్కడ & ఇక్కడ).

బ్యాంకులు చట్టాలకు లోబడే రికవరీ చేయాలనీ సుప్రీం కోర్టు సూచించింది:

ఐతే ఆ తరవాత సుప్రీం కోర్టు ఇలా వాహనాలను బలవంతంగా తీసుకెళ్ళడాన్ని తోసి పుచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాహనాలపై బ్యాంకు/ఫైనాన్స్ కంపెనీలకు హక్కు ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తూనే బలవంతంగా వాహనాలను తీసుకేల్లడాన్ని కోర్టు ఖండించింది (ఇక్కడ & ఇక్కడ). వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి RBI, SARFAESI Act, 2002 మరియు ఈ చట్టం కింద రూపొందించిన Security Interest (Enforcement) Rules, 2002లో పేర్కొన్న నియమాలను పాటించాలని కోర్టు సూచించింది.

అంతకు ముందే వాహనాల స్వాధీనం, రికవరీ ఏజెంట్లు అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించి RBI కొన్ని గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. స్వాధీనం చేసుకునే ముందు కస్టమర్‌లకు నోటీసు పీరియడ్ ఇవ్వడం, ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ అనుసరించే విధానం గురించి కస్టమర్‌లకు ముందుగానే చెప్పడం మరియు స్వాధీనం చేసుకున్న ఆస్తి అమ్మకం/వేలం కోసం బ్యాంక్ అనుసరించే విధానం గురించి చెప్పడం, మొదలైనవి ఈ నిబంధనలలో భాగం.

ఈ మధ్య కాలంలో ఇదే అంశానికి సంబంధించి పాట్నా హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. RBI మార్గదర్శకాలు మరియు చట్టాన్ని పాటించకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఆర్టికల్ 21లో పొందుపరిచిన జీవనోపాధి/గౌరవంగా జీవించే  ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని పేర్కొంది. ముందు చెప్పినట్టు RBI మరియు SARFAESI Act, సంబంధిత రూల్స్ ప్రకారం మాత్రమే ఈ ప్రక్రియ ఉండాలని పేర్కొంది.

చివరగా, రికవరీలు చేసే సందర్భాల్లో బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలు చట్టాలలో పేర్కొన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీం కోర్టు సూచించింది.

Share.

About Author

Comments are closed.

scroll