ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మార్లేనా ఒక పాఠశాలను తనిఖీ చేస్తూ, దాని మౌలిక సదుపాయాల దుస్థితిపై ఆ పాఠశాల నిర్వాహకులను మందలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తోందని, దాని కొత్త విద్యాశాఖ మంత్రి ఆతిషి పొరపాటున పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయన్న నిజాన్ని బయటపెట్టారని పోస్ట్ పేర్కొంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మార్లేనా, ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల పేలవమైన స్థితిని బయటపెట్టారు.
ఫాక్ట్ (నిజం): ఆతిషి మార్లేనా సందర్శించిన పాఠశాల మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ద్వారా నిర్వహించబడుతుంది, ఢిల్లీ ప్రభుత్వంచే కాదు. డిసెంబర్ 2022లో జరిగిన MCD ఎన్నికలలో AAP గెలిచింది, షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ నగర మేయర్ అయ్యారు. ఈ తనిఖీలో ఆతిషితో పాటు ఒబెరాయ్ కూడా ఉన్నారు. ఈ పాఠశాలను సందర్శించిన అనంతరం ఆతిషి మార్లేనా మాట్లాడుతూ MCDలో బీజేపీ యొక్క పదిహేనేళ్ల పాలనే పాఠశాల అధ్వాన స్థితికి కారణమన్నారు. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా ఉంది.
పోస్టులోని క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని నిర్ధారించుకోవటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికగా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారిక ఛానెల్ ద్వారా అప్‌లోడ్ చేయబడిన ఒక YouTube వీడియోకు దారితీసింది. ఈ వీడియో వైరల్ వీడియో యొక్క పెద్ద వెర్షన్. దీని ప్రకారం ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మార్లేనా మరియు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ MCD ఆధ్వర్యంలో వజీరాబాద్ గ్రామంలోని నడుస్తున్న పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, నిర్వహణ సరిగా లేకపోవడంతో వారు అధికారులను నిలదీయడాన్ని వీడియోలో చూడవచ్చు.
బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన ఒక వార్త కథనం ప్రకారం ‘పాఠశాల ప్రిన్సిపాల్‌ని ఆమె నిర్లక్ష్య వైఖరికి మందలిస్తూ, ఆతిషి మార్లేనా మాట్లాడుతూ, పాఠశాల అటువంటి పరిస్థితిలో ఉండటం సరికాదు అని చెప్తూ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో (MCD) బీజేపీ యొక్క 15 ఏళ్ల పాలన యొక్క ఫలితమే ఇది అన్నారు …..’ దీనిపై మరికొన్ని వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మరియు ఢిల్లీ ప్రభుత్వం వేరు వేరు నిర్దిష్ట విధులను కలిగి ఉన్నాయి; కొన్ని రంగాలలో ఈ రెండూ విధులను పంచుకొంటాయి . అందులో విద్యా రంగం ఒకటి; MCD ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తుంది, ఢిల్లీ ప్రభుత్వం ఉన్నత మరియు సెకండరీ పాఠశాలలు, మరియు కళాశాలను నడపాలి.
డిసెంబరు 2022లో జరిగిన ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో AAP గెలవడానికి ముందు, బీజేపీ పదిహేనేళ్లపాటు అధికారంలో ఉంది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ MCD ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలను అభివృద్ధి చేయడంపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని చెప్పారు. దీనిపై భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా (ఇక్కడ మరియు ఇక్కడ) నిధులు ఇవ్వకపోవడమే MCD ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల అధ్వాన స్థితికి కారణం అన్నారు.
చివరిగా, ఈ వీడియోలో ఢిల్లీ విద్యా మంత్రి ఆతిషి మార్లేనా తనిఖీ చేసినది ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల కాదు, MCD ద్వారా నిర్వహించబడుతున్న పాఠశాల.