Fake News, Telugu
 

ఐస్ క్రీమ్ & ఫ్రోజెన్ డెసర్ట్, రెండిటినీ ప్రాథమికంగా పాలు/పాల ఉత్పన్నాలతో తయారు చేస్తారు

0

‘ఫ్రోజెన్ డెసర్ట్’ అని పేరుతో ఉన్న ఉత్పత్తులలో పాలు/పాల పదార్ధాలు ఉండవని, వీటిని కేవలం వెజిటబుల్ ఆయిల్‌తో తయారు చేస్తారని, ఐస్ క్రీమ్ అని పేరుతో ఉన్న వాటిని మాత్రమే పాలు/పాల పదార్ధాలతో తయారు చేస్తారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇటువంటి వీడియోనే ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఐస్ క్రీమ్ అని పేరుతో ఉన్న వాటిని మాత్రమే పాలు/పాల పదార్ధాలతో తయారు చేస్తారు. ‘ఫ్రోజెన్ డెసర్ట్’ అని పేరుతో ఉన్న ఉత్పత్తులను కేవలం వెజిటబుల్ ఆయిల్‌తో తయారు చేస్తారు. 

ఫాక్ట్: ఐస్ క్రీమ్ మరియు ఫ్రోజెన్ డెసర్ట్, రెండిటిలో పాలు/పాల ఉత్పన్నాలు ఉంటాయి. అయితే ఐస్ క్రీం తయారీ ప్రక్రియలో పాలలో నుంచి తీసిన కొవ్వుని వాడతారు. ఫ్రోజెన్ డెసర్ట్లో వెజిటబుల్ ఆయిల్‌ను వాడతారు. ఈ రెండు పదార్ధాలని వాడిన విధానం, మోతాదుని బట్టి కొన్ని ప్రయోజనాలు ఉన్నా, ఆరోగ్య పరంగా కొన్ని దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ విషయంలో నిజానిజాలను తెలుసుకోడానికి ‘ఫ్రోజెన్ డెసర్ట్’ పేరుతో ఉత్పత్తులని అమ్ముతున్న క్వాలిటి వాల్స్, క్రీమ్ బెల్, డైరీ డే వంటి బ్రాండ్లు తయారుచేసిన ఫ్రోజెన్ డెసర్ట్ ప్యాకెట్‌పై ఉండే వివరాలను పరీక్షించాము. వీటిని పాలు/మిల్క్ సాలిడ్స్ తో తయారు చేస్తారని దానిపై పేర్కొన్నారు. పాలలో నుంచి నీటిని వేరు చేసిన తరువాత మిగిలిన పదార్థాన్నే మిల్క్ సాలిడ్ అంటారు. దీన్ని బట్టి ఫ్రోజెన్ డెసర్ట్ పాలతో కాకుండా కేవలం వెజిటబుల్ ఆయిల్‌ను వాడి తయారు చేస్తారని చెప్పడం సరైంది కాదు.   

FSSAI నిబంధనల ప్రకారం ఐస్ క్రీంలో వెజిటబుల్ ఆయిల్/కొవ్వుని, లేదా వెజిటబుల్ ప్రోటీన్‌ని వాడే కంపెనీలు తమ ఉత్పత్తులపై ఐస్ క్రీమ్ అని కాకుండా ఫ్రోజెన్ డెసర్ట్ అని ముద్రించాలి.

ఐస్ క్రీంలో వెజిటబుల్ ఆయిల్ ఎందుకు వాడతారు?

సాధారణంగా ఐస్ క్రీం తయారీలో పాల నుంచి వచ్చిన కొవ్వుని వాడుతారు. ఇది ఐస్ క్రీమ్ యొక్క రుచి, చిక్కదనం, ఆకృతి మొదలైన వాటిని పెంచడానికి దోహదపడుతుంది. అయితే కొన్ని కంపెనీలు దీనికి ప్రత్యామ్నాయంగా వెజిటబుల్ ఆయిల్ (కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ మొదలైనవి), కోకొ బటర్ మొదలైనవి కూడా వాడతారు. కొవ్వు శాతం తగ్గించడం, ప్రత్యేక రుచులను జోడించడం, తక్కువ ధరకు లభించడం మొదలైనటువంటి కారణాల రీత్యా కంపెనీలు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాయి.

వెజిటబుల్ ఆయిల్‌ మరియు పాల కొవ్వు, వీటిలో ఏది మంచిది?

వెజిటబుల్ ఆయిల్‌ను వాడి చేసిన ఐస్ క్రీమ్‌తో పోల్చుకుంటే పాల కొవ్వును వాడి చేసిన ఐస్ క్రీమ్‌లో Saturated fats మరియు కొలెస్ట్రాల్ శాతం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే, కొన్ని రకాల వెజిటబుల్ నూనెల్లో ఉండే Trans fat ప్రభావంపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎటువంటి ఐస్ క్రీమ్/ ఫ్రోజెన్ డెసర్ట్ ను అయినా తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అమూల్ vs క్వాలిటీ వాల్స్ కేసు:

ఇక 2017లో అమూల్ సంస్థ విడుదల చేసిన రెండు వాణిజ్య ప్రకటనలు (ఇక్కడ& ఇక్కడ) తమ ఉత్పత్తులపై ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని క్వాలిటీ వాల్స్ యాజమాన్య సంస్థ హిందుస్థాన్ యునిలివర్ కోర్టులో కేసు వేసింది. ఫ్రోజెన్ డెసర్ట్ లో హానికరంగా పరిగణించబడే వనస్పతి (డాల్డా)ను వాడతారని అమూల్ ఈ ప్రకటనలో పేర్కొంది. అయితే, తాము ఉత్పత్తి చేసే ఫ్రోజెన్ డెసర్ట్ లలో వనస్పతిని వాడమని వెజిటబుల్ ఆయిల్‌ను వాడతామని కోర్టులో వాదించింది. ఇది కేవలం పాల కొవ్వుకి ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడతామని, ఐస్ క్రీమ్ లాగానే ఫ్రోజెన్ డెసర్ట్ను కూడా పాలు/పాల ఉత్పన్నాలతో తయారు చేస్తామని హిందుస్తాన్ యునిలివర్ స్పష్టం చేసింది. కేసు వివరాలను పరిశీలించిన బాంబే హైకోర్టు ఈ ప్రకటనలలో అభ్యంతరకరమైన సన్నివేశాలని తొలగించాలని తీర్పుని జారీ చేసింది.

చివరిగా, ఫ్రోజెన్ డెసర్ట్ పాలతో కాకుండా కేవలం వెజిటబుల్ ఆయిల్‌తో మాత్రమే చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll