Fake News, Telugu
 

కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగం గురించి సందేశం ఇస్తున్న ఈ వ్యక్తి ఆర్మీ జవాన్ కాదు

0

“స్వతంత్రాన్ని కాపాడటానికి బోర్డర్లో ప్రాణాలను అర్పిస్తున్నాం, ‘ఓటు’ అమ్ముకొని భావితరానికి నాంది పల్కకండి. మా ప్రాణ త్యాగాలను వృధా చెయ్యకండి” అని రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకున్న ఒక వ్యక్తి ఫోటోను పోస్టు చేస్తూ, ఇది కరీంనగర్ బస్టాండ్ సమీపంలో మన దేశం కోసం సరిహద్దులో పనిచేస్తూ మన దేశాన్ని కాపాడుతున్న ఒక జవాన్ ప్రయత్నం అంటూ షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్:  కరీంనగర్ బస్టాండ్ సమీపంలో మన దేశం కోసం సరిహద్దులో పనిచేస్తూ మన దేశాన్ని కాపాడుతున్న ఒక జవాన్ ఓటు హక్కు వియోగం గురించి సందేశం ఇస్తున్నాడు.

ఫాక్ట్: ఈ ఫొటోలో ఉన్నది కరీంనగర్ జిల్లాకు చందిన కోట శ్యామ్ కుమార్. ఈయన ఓటు హక్కును వినియోగించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి ఓటు పై అవగాహన కల్పించేందుకు ఇలా చేస్తున్నానని మీడియాకు తెలిపాడు. శ్యామ్ 2018 నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. ఇతని అఫిడవిట్ వివరాలు, ఫేస్బుక్ ప్రొఫైల్ గమనిస్తే అతడు స్వయం ఉపాధి పొందుతున్నాడని తెలిసింది. అంతే కాదు, అతను ఎక్కడా కూడా భారత సైన్యంలో పని చేసానని చెప్పలేదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ పోస్టులో ఉన్న వ్యక్తి యొక్క ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, పలు న్యూస్ ఛానళ్ళు ఈ వ్యక్తి గురించి కథనాలు ప్రసారం చేశాయని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఈయన కరీంనగర్ జిల్లాకు చందిన కోట శ్యామ్ కుమార్. ఈయన ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కును వినియోగించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి ఓటుపై అవగాహన కల్పించేందుకు ఇలా చేస్తున్నానని తెలిపాడు. అంతే కాకూండా, గత ఆరేళ్ల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కోట శ్యామ్ కుమార్‌ మీడియాకు తెలిపారు.

శ్యామ్ కుమార్ గురించి మరింత వెతకగా, ఇతని ఎలక్షన్ అఫిడవిట్ (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు న్యూస్ ఆర్టికల్ ద్వారా ఇతను 2018 నుండి తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని స్పష్టమైంది. 

అయితే, శ్యామ్ కుమార్ ఇంతకముందు వివిధ వేషధారణలతో ప్రజలకు ఓటు విలువ గురించి ప్రచారం చేసాడు అని గమనించాం. అదే విధంగా  ఇటీవల ఆర్మీ జవాన్ వేషంలో కరీంనగర్లో ఓటు విలువ గురించి ప్రచారం చేయడం జరిగింది. శ్యామ్ కుమార్ అఫిడవిట్ వివరాలు, ఫేస్బుక్ ప్రొఫైల్ గమనిస్తే అతడు స్వయం ఉపాధి పొందుతున్నాడని, ఎక్కడా అతను భారత సైన్యంలో పని చేసానని చెప్పలేదు.

ఆర్మీ జవాన్లు ఎన్నికల్లో లేదా సంబంధించిన విషయాల్లో పాల్గొనవచ్చా అని రీసెర్చ్ చెయ్యగా, ఆర్మీ రూల్స్, 1954 మరియు ఆర్మీ ఆక్ట్, 1950  ప్రకారం, ఈ చట్టం ద్వారా నియంత్రించబడే వ్యక్తులు రాజకీయ సమావేశాలు, ప్రదర్శనలు లేదా రాజకీయ సంఘాలు లేదా ఉద్యమాలతో అనుబంధంగా పాల్గొనడం నిషేధించబడింది. అలాగే, ప్రెస్‌తో కమ్యూనికేట్ చేయడం లేదా ఏదైనా వ్రాతపూర్వక విషయాలను ప్రచురించడం నిషేధించబడింది అని స్పష్టమైంది. 

చివరిగా, కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వియోగం గురించి సందేశం తెలుపుతున్న వ్యక్తి ఆర్మీ జవాన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll