Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్నది ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ టీచర్ శామ్యూల్ ప్యాటీ కాదు

0

కొందరు యువతీ యువకులు వలసదారులను ఆహ్వానిస్తున్నట్టు ఉన్న ఫొటోలో ఉన్నది ఇటీవలే ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ వ్యక్తి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

           ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: ఇటీవలే ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ వ్యక్తి వలసదారుల్ని ఆహ్వానిస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): పోస్టులో చూపిస్తున్న ఫోటో 17 అక్టోబర్ 2020న ఇంగ్లాండ్ లోని కెంట్ లో గుడ్ ఛాన్స్ అనే సంస్థ వలసదారులని స్వాగతిస్తున్న సందర్భంలో తీసిన ఫోటో. ఫ్రాన్స్ లో టీచర్ తల నరికేసిన ఘటన 16 అక్టోబర్ 2020న జరిగింది. దీన్నిబట్టి ఈ ఫోటోకి ఫ్రాన్స్ లో జరిగిన ఘటనకి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని లండన్ కి చెందిన ‘గుడ్ ఛాన్స్’ అనే ఆర్ట్ & థియేటర్ సంస్థ తమ ట్విట్టర్ అకౌంట్ లో 17 అక్టోబర్ 2020న షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఈ ఫోటోని ‘తమ సంస్థ వారు కెంట్ లోని ఫోల్క్ స్టోన్ లో వలసదారులని ఆహ్వానిస్తున్నారు’ అనే వివరణతో షేర్ చేసారు. ఐతే ఈ పోస్ట్ ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఫోల్క్ స్టోన్ లో వలసదారులని ఆహ్వానిస్తున్న వార్తని ప్రచారం చేసిన కొన్ని వార్తా కధనాలు మాకు కనిపించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.  దీన్నిబట్టి ఈ ఫోటోలు ఇంగ్లాండ్ కి సంబంధించిందని, ఫ్రాన్స్ కి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఐతే ఈ ఫోటోని జూమ్ చేసి చుస్తే ఫొటోలో ఉన్న వారు పట్టుకున్న ప్లకార్డ్స పైన గుడ్ ఛాన్స్  సంస్థ లోగో చూడొచ్చు. పైగా ఈ ఫొటోలో ఉన్నవారి వెనకాల ఉన్న పోలీస్ వ్యాన్ పైన కెంట్ పోలీస్ అని రాసి ఉంది, దీన్నిబట్టి  ఈ ఫోటో ఇంగ్లాండ్ లోని కెంట్ లో తీసిందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవలే ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ టీచర్ శామ్యూల్ ఫ్యాటీ ఫోటోని పోస్టులో చూపిస్తున్న ఫోటోని పోల్చి చుస్తే రెండు ఫోటోల మధ్య చాలా వ్యత్యాసం ఉంది, పోస్టులో ఉన్నది శామ్యూల్ ఫ్యాటీ ఫోటో కాదని కచ్చితంగా చెప్పొచ్చు. వీటన్నిటి ఆధారంగా పోస్టులో ఉన్న ఫోటో ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ టీచర్ శామ్యూల్ ఫ్యాటీది కాదని, ఈ ఫోటోకి ఫ్రాన్స్ లో జరిగిన ఘటనకి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఫ్రాన్స్ లో 16 అక్టోబర్ 2020న తరగతి గదిలో ప్రోఫెట్ మొహమ్మద్ కార్టూన్లు ప్రదర్శించినందుకు శామ్యూల్ ఫ్యాటీ అనే టీచర్ తలని అబ్దుల్లాక్ అంజోరోవ్ అనే 18 ఏళ్ల వ్యక్తి నరికిన ఘటన నేపథ్యంలో పోస్టులో చెప్తున్న లాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఐతే ఈ ఘటన తరవాత రాడికల్ ఇస్లామైజేషన్ పై కఠినంగా వ్యవహరిస్తామని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యూల్ మక్రోన్ మీడియా తో మాట్లాడుతూ అన్నారు. ఇస్లామిక్ అతివాదులని ప్రోత్సహిస్తున్న మసీదులను మూసి వేస్తామని, వేరే దేశం లో పుట్టి ఫ్రాన్స్ లో రాడికలైజ్ అయిన వారిని వారి దేశాలకు తిరిగి పంపిస్తామని, ఆన్లైన్ లో జరిగే ఆక్టివిటీపై నిఘా ఉంచుతామని మక్రోన్ అన్నారు. 

చివరగా, సంబంధం లేని ఫోటోని ఇటీవల ఫ్రాన్స్ లో తల నరికివేయబడ్డ టీచర్ శామ్యూల్ ప్యాటీ అని ప్రచారం చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll