తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో ప్రజలు స్వాగతం పలుకుతున్నది DMK నాయకుడు M.K. స్టాలిన్ కి, రాహుల్ గాంధీకి కాదు. ఈ ఫోటోలు 19 మర్చి 2021 నాడు M.K. స్టాలిన్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తీసినవి. రాహుల్ గాంధీ 19 మరియు 20 మార్చి 2021 తేదీలలో అస్సాం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సీర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని ‘DMK – Dravida Munnetra Kazhagam’ పార్టీ 19 మార్చి 2021 నాడు తమ అధికారిక ఫేస్బుక్ మరియు ట్విట్టర్ హేండిల్స్ లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ర్యాలీకి సంబంధించి Dravida Munnetra Kazhagam (DMK) పార్టీ షేర్ చేసిన మరికొన్ని ఫోటోలను బట్టి, ప్రజలు స్వాగతం పలుకుతున్నది DMK అధినేత M. K. స్టాలిన్ కి అని స్పష్టమయ్యింది.
19 మార్చి 2021 నాడు నిర్వహించిన ఈ ఎన్నికల ర్యాలీ లైవ్ వీడియోని, M. K. స్టాలిన్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసారు. తమిళనాడు లో జరగబోతున్న ఎన్నికలలో DMK పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటి చేస్తోంది. కాని, 19 మార్చి 2021 నాడు నిర్వహించిన ఈ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు.
19 మరియు 20 మార్చి 2021 తేదిలలో రాహుల్ గాంధీ, అస్సాంలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్న ఆ ఎన్నికల సభల ఫోటోలు, వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో ప్రజలు స్వాగతం పలుకుతున్నది రాహుల్ గాంధీకి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, DMK అధినేత M.K. స్టాలిన్ ఎన్నికల ర్యాలీ ఫోటోలని తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.