Fake News, Telugu
 

ఈ వీడియోలోని వ్యక్తులు ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నారు, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని కాదు

0

కర్నూలు జిల్లా హోలగుంద గ్రామం లో SPDI పేరుతో ఉన్న పాకీస్థాన్ ఉగ్రవాదులు……‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు ఇస్తున్నారు,” అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్నూలు జిల్లా హోళగుంద గ్రామంలో SPDI సంస్థ ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని వ్యక్తులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేయట్లేదు. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేందుకు అధికారులు అనుమతి నిరాకరించి, తరువాత ధర్నాకి కూడా అనుమతి లేదని కొందరిని అరెస్టు చేయడంతో ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ అని నినాదాలు చేసారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

వీడియోలోని ఘటన గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ ఘటన గురించి వివిధ వార్తాసంస్థలు (ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి) ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. “కర్నూలులో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంతో హోళగుంద బస్టాండులో ధర్నా చేపట్టాలని నిర్ణయించాము. అయితే ధర్నాకు అనుమతి లేదని కొందరిని అరెస్టు చేయడం అన్యాయం” అని ఎస్‌డీపీఐ కార్యదర్శి  సైఫుల్లా అన్నారని ఆంధ్రజ్యోతి అర్టికల్‌లో చదవచ్చు. అయితే, ఆ ధర్నాలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసినట్టు ఎవరూ రిపోర్ట్ చేయలేదు.

వీడియోలో చేసిన నినాదాలు సరిగ్గా వింటే, వారు ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ అని అన్నట్టు వినొచ్చు. అదే ధర్నా యొక్క వేరే వీడియోలో ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ అని స్పష్టంగా వినవచ్చు. ఒక జర్నలిస్ట్ కూడా మొదట పోస్ట్‌లోని వీడియో పెట్టి అదే (‘పాకిస్థాన్ జిందాబాద్’) క్లెయిమ్ చేసాడు, కానీ తరువాత ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ నినాదాలు చేసినట్టు చెప్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసిన వివరణ వీడియోని ట్వీట్ చేసాడు.

వైరల్ అయిన తప్పుడు క్లెయిమ్ గురించి ‘Sdpi Holagunda’ మరియు ‘PFi Holagunda’ ఫేస్బుక్ పేజీలు పెట్టిన వివరణ పోస్ట్‌లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలోని వ్యక్తులు ‘పాపులర్ ఫ్రంట్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నారు, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll