Fake News, Telugu
 

అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షునికి వేదమంత్రాలతో స్వాగతం పలకలేదు

0

అమెరికాలో నూతన అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రవేశిస్తున్నప్పుడు అతడికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు అని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాలో నూతన అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రవేశిస్తున్నప్పుడు అతడికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2014లో Hindu American Seva Communities వైట్ హౌస్ లో జరిపిన ఒక కాన్ఫరెన్స్ లో భాగంగా వేదమంత్రాలు చదివిన సందర్భానికి సంబంధించింది. వేద మంత్రాలూ చదవటానికి అమెరికాలో నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడికి స్వాగతం పలకడానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో ‘Vedic slokas chanting in white house’ అనే కీవర్డ్ తో సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న వీడియో లోని విజువల్స్ పోలిన ఒక 2014 యూట్యూబ్ వీడియో మాకు దొరికింది. ఈ వీడియో లో కనిపిస్తున్న విజువల్స్ లో  ‘Hindu American Seva Communities Conference @ White House Oct 2, 2014’ అని రాసి ఉండడం చూడొచ్చు.

యూట్యూబ్ వీడియో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా Hindi America Seva Communities (HASC) వారి వెబ్సైటు మాకు కనిపించింది. ఈ వెబ్సైటు లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం HASC 2011 నుండి ప్రతీ సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో వైట్ హౌస్ లో ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటుంది. ఐతే 2015 నుండి ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించి ఎటువంటి సమాచారం వెబ్సైటులో అందుబాటులో లేదు. యూట్యూబ్ వీడియో మరియు ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టులోని వీడియోలో చూపిస్తున్న వేద మంత్రాలూ చదవటం అనేది 2014లో జరిగిన కాన్ఫరెన్స్ లో భాగమని చెప్పొచ్చు. పైగా ఈ వేద మంత్రాలూ చదవటానికి అమెరికాలో నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడికి స్వాగతం పలకడానికి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులోని వీడియోలో చూపిస్తున్న వేదమంత్రాలు చదవటం 2014లో వైట్ హౌస్ లో జరిగిన HASC కాన్ఫరెన్స్ లో భాగంగా జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll