Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభానికి మోదీని పొగుడుతూ న్యూయార్క్ టైమ్స్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులను భారత ప్రధాని మోదీకి ఆపాదిస్తూ ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొందంటూ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ నేపధ్యంలో ‘పాకిస్తాన్‌కి మోదీ ఎంత నష్టం కలిగించారంటే! బహుశా యుద్ధం చేసినా కూడా అంత నష్టం చేయలేకపోయేవారేమో’ , అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌కి మోదీ ఎంత నష్టం కలిగించారంటే! బహుశా యుద్ధం చేసినా కూడా అంత నష్టం చేయలేక పోయేవారేమో – న్యూయార్క్ టైమ్స్

ఫాక్ట్(నిజం): ప్రస్తుత పాకిస్తాన్‌ సంక్షోభాన్ని మోదీకి ఆపాదిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కథనాలు ప్రసారం చేయలేదు. ఒకవేళ న్యూయార్క్ టైమ్స్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, ఆ రిపోర్ట్స్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేవి, కాని అలాంటి కథనాలేవి మాకు లభించలేదు. పెరుగుతున్న రుణాలు, ఫారెక్స్ నిల్వలు క్షీణించడం, పెరిగిన ఇంధన దిగుమతి ఖర్చులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, మొదలైనవి ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభానికి కారణాలని నిపుణులు పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.  పాకిస్తాన్‌లోని పరిస్థితులకు మోదీ/భారత్‌కు ఆపాదిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎలాంటి కథనాలు ప్రసారం చేయలేదు.

ఒకవేళ న్యూయార్క్ టైమ్స్ నిజంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే దీనిపై చర్చ జరిగి ఉండేది, ఆ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉండేది. కాని అలాంటి వివరాలేవీ మాకు లభించలేదు. న్యూయార్క్ టైమ్స్ మాత్రమే కాక మరే ఇతర ప్రముఖ వార్తా సంస్థ కూడా పాకిస్తాన్‌ సంక్షోభానికి మోదీ కారణం అంటూ వ్యాఖ్యానించడం గానీ కథనాలు ప్రసారం చేయడం కాని చేయలేదు. పాకిస్తాన్‌ సంక్షోభానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కొన్ని కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభానికి పెరుగుతున్న రుణాలు, ఫోరెక్స్ నిల్వలు క్షీణించడం, పెరిగిన ఇంధన దిగుమతి ఖర్చులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, గత సంవత్సరం సంభవించిన వరదలు మొదలైనవి కారణాలని నిపుణులు పేర్కొన్నారు.

చివరగా, పాకిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభానికి మోదీని పొగుడుతూ న్యూయార్క్ టైమ్స్ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll